
పులిచింతలకు 32,741 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 3 క్రస్ట్‌గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 32,741 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 2 క్రస్ట్‌గేట్లు 1.5 మీటర్లు, మరో క్రస్ట్‌గేటు 2 మీటర్లు ఎత్తు ఎత్తి 24,116 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్పాదన అనంతరం 8,625 క్యూసెక్కులు మొత్తం 32,741 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు 75.50 మీటర్లకు గాను 75.50 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.080 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. టీఆర్‌సీ లెవల్ 55.91 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం 33,211 క్యూసెక్కులు వస్తుందని వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.
నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఖతార్ దేశంలోని దోహాలో రిజిస్టర్డ్ నర్సుల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ జీఎన్‌ఎం నర్సింగ్ పూర్తిచేసి రెండు సంవత్సరాల అనుభవం కలిగి 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 13వ తేదీన విజయవాడ రమేష్ హాస్పటల్ రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని ఓఎంసీఏసీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు రోజుకు 12గంటలు, వారానికి 6 రోజులు పనిదినాలు, ఏడాదికి 20 రోజులు సెలవులు ఉంటాయన్నారు. నెలకు సుమారు రూ1.2లక్షలు వేతనం లభిస్తుందని తెలిపారు. అభ్యర్థులు 2 సంవత్సరాల ఒప్పంద కాలానికి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 9988853335, 8712655686, 8790118349 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.