
అలరించిన ‘మోహినీ భస్మాసుర’
తెనాలి: పురాణగాథ ‘మోహినీ భస్మాసుర’ పద్యనాటకంగా పండిత పామరులను అలరిస్తూనే ఉంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న వీణా అవార్డ్స్–2025 జాతీయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక/నాటికల పోటీల్లో నాలుగోరోజైన మంగళవారం తొలి ప్రదర్శనగా ఈ నాటకం అలరించింది. విజయనగరానికి చెందిన అక్కినేని సాంస్కృతిక సమాజం ప్రదర్శించగా, వీక్షకుల కరతాళధ్వనులను అందుకుంది. వృకాసురుడనే రాక్షసుడు అయిదేళ్లపాటు భీకర తపస్సు చేయటంతో శివుడు ప్రత్యక్షమై, అడిగినదే తడవుగా ఎవరి తలపైనయినా చేయి పెట్టిన వెంటనే అతడు భస్మమయేలా, ఎవరివల్ల కూడా వృకాసురుడికి మరణం లేకుండా వరాలిస్తాడు. ఈ వరాలతో జరిగే కీడు తెలిసిన నారదుడు రెచ్చగొట్టటంతో వరాన్ని పరీక్షించుకునేందున వృకాసరుడు నేరుగా శివుడు దగ్గరకు వెళతాడు. శివుడు తప్పించుకుని శ్రీవిష్ణువును శరణు వేడతాడు. విష్ణువు నారదుడిని సంప్రదించి, మోహినీరూపం దాల్చి వృకాసురుని అంతమొదించటం ఇతివృత్తం. మద్దెల పంచనాదం రచనకు గవర సత్తిబాబు దర్శకత్వం వహించారు. వృకాసురుడుగా దాసరి తిరుపతినాయుడు, మోహినిగా కేవీ పద్మావతి, లక్ష్మీదేవిగా పి.నీలవేణి, నారుదుడిగా గవర సత్తిబాబు పాత్రోచితంగా నటించారు.
ఆకట్టుకున్న ఇతివృత్తాలు
అనంతరం టీజీవీ కళాక్షేత్రం, కర్నూలు వారి ‘జగదేక సుందరి సామా’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. సామా అనే వేశ్య ఎందరినో బానిసలను చేసుకుంటుంది. వేలంలో కొనుగోలు చేసిన బానిస మాఘపై మనసు పడుతుంది. ఆమె దగ్గర బానిసలను విడిపించటానికి మాఘ ఆమెను ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. అతడి మాటలను నమ్మి బానిసలు విడుదల చేస్తుంది. ఆ వెంటనే సామా ఎదుటనే మాఘ విషం తీసుకుని మరణిస్తాడు. విరక్తి చెందిన సామా ఆత్మహత్యకు పూనుకోగా, పుణ్యకుడు అనే బౌద్ధగురువు హితబోధతో బౌద్ధసన్యాసినిగా మారుతుంది. సామాగా ప్రముఖ రంగస్థల, సినీనటి సురభి ప్రభావతి అద్భుతంగా నటించారు. ఇతర పాత్రల్లో జీవీ శ్రీనివాసరెడ్డి, కె.బాలవెంకటేశ్వర్లు, పి.రాజారత్నం నటించారు. పల్లేటి కులశేఖర్ రచనకు పద్యాలు/దర్శకత్వం పత్తి ఓబులయ్య. అనంతరం మానవత, యడ్లపాడు వారి ‘అంతా మంచివారే...కానీ’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం జరుగుల రామారావు. చివరగా అభ్యుదయ ఆర్ట్స్, విజయవాడ వారు ‘క్రతువు’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. కేవీవీ సత్యనారాయణ రచనకు వేంపాటి రమేష్ దర్శకత్వం వహించారు. నాటకపోటీలను కళల కాణాచి, తెనాలి, ఆర్‌ఎస్‌ఆర్ గ్రీన్‌వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో కొనసాగిస్తున్నారు.