
చేనేత పరిశ్రమను సర్వ నాశనం చేసిన ప్రభుత్వం
సత్తెనపల్లి: చేనేతపై జీఎస్టీ వేసి పరిశ్రమను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు విమర్శించారు. సంఘం 11వ రాష్ట్ర మహాసభలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, వసతి ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మహాసభల ప్రాంగణం ఆర్చీ వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివదుర్గారావు మాట్లాడుతూ మహాసభల్లో చేనేత రంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చిస్తామని తెలిపారు. చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు తీసుకోవలసిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. మహాసభల ప్రారంభం రోజు 6వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో చేనేత కార్మికుల భారీ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. వసతి ఏర్పాట్లు, మహాసభ జరిగే ప్రాంగణం, ఆర్చీ అన్ని ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల వీరబ్రహ్మం, కమిటీ సభ్యులు పి. ప్రభాకర్, జి. సుసులోవ్, మల్లాల గురవయ్య, బిట్రా పానకాలు, జి. ఏసురత్నం, ఆవాజ్ సంఘం నాయకులు షేక్ మస్తాన్‌వలి పాల్గొన్నారు.