
పేదల కోసం పనిచేసిన జగనన్న
నరసరావుపేట: రాష్ట్రంలో మాల, మాదిగ, రెల్లి కులాలకు చెందిన దళితులకు రానున్న ప్రభుత్వంలో పూర్తిగా న్యాయం జరుగుతుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం పట్టణంలోని కాసు కల్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పూనూరి గౌతమ్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కొమ్మూరి కనకారావుతోపాటు పలువురు ఎస్సీ సెల్ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవనరామ్ చిత్రపటాలకు నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షులతో జిల్లా అధ్యక్షులు ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్‌బాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని బలహీనులపై అక్రమ కేసులు బనాయించి కూటమి నాయకులు వేధిస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో దళితులు ఎమ్మెల్యేలు, మార్కెట్ యార్డు చైర్మన్లు కాగలిగారని అన్నారు. ప్రతి నియోజకవర్గ అధ్యక్షుడు ఐదుగురు సభ్యులతో గ్రామస్థాయి ఎస్సీ సెల్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. సుమారు 16 వేల గ్రామాల నుంచి ఐదుగురు చొప్పున 80 వేల మంది దళిత సభ్యులతో ఏర్పాటయ్యే దళిత ఫోర్స్‌తో వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. గత ఐదేళ్లలో రూ.2.75లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా మాజీ సీఎం జగన్ పంపిణీ చేశారని గుర్తు చేశారు. దీనిలో 16.5 శాతం ఉన్న మాల, మాదిగ, రెల్లి కులస్తులైన దళితులకు ఏడాదికి రూ.12వేల కోట్లు చొప్పున రూ.60వేల కోట్లు అందాయన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెండేళ్ల నుంచి దళితులు ఆ డబ్బును కోల్పోయారని, పైసా ఇవ్వకుండా రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూనుకున్నాడన్నారు. దళితులను ఆర్థికంగా దెబ్బతీస్తున్న చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లను ఎన్నికల్లో ఓడించాల్సిన బాధ్యత దళితులపై ఉందన్నారు.
సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కొమ్మూరి కనకారావు మాట్లాడారు. జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షులు మధు, శివరాజు, మేకల లక్ష్మణ్, కుక్కల పోలయ్య, రవికిషోర్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మాచర్ల సుందరరావు, చిలకా పెదబాబు, గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా ప్రధాన కార్యదర్శి బేతం గాబ్రియేలు, అన్నవరపు కిషోర్, గుండాల వెంకటేష్, కందుల శ్రీకాంత్, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న
జిల్లా అధ్యక్షులు కొమ్మూరి చంద్రశేఖరరావు
హాజరైన ఎస్సీ నాయకులు, కార్యకర్తలు
జిల్లా ఎస్సీ సెల్ కార్యనిర్వాహక
సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు
టీజేఆర్ సుధాకర్‌బాబు
పాల్గొన్న పిన్నెల్లి, విడదల రజిని,
డాక్టర్ గోపిరెడ్డి, కాసు మహేష్,
గౌతమ్‌రెడ్డి, డాక్టర్ గజ్జల
హాజరైన రాష్ట్ర, జిల్లా ఎస్సీ సెల్
నాయకులు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పేదల అభివృద్ధి కోసమే పనిచేశారు. కూటమి ప్రభుత్వం తనపైనా అక్రమ కేసులు పెట్టింది. అక్రమ కేసులు పెట్టినా తనను పార్టీ నుంచి విడదీయలేరు. వైఎస్సార్ సీపీకి గత ఎన్నికల్లో 11 సీట్లు లభించినా 40శాతం ఓటింగ్ ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. ఆరోగ్యశ్రీ పథకానికి చెల్లింపులు ఆపేశారని, పథకాల అమలుల్లో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్దిలేదు. మళ్లీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలి.
–విడదల రజిని, మాజీ మంత్రి

పేదల కోసం పనిచేసిన జగనన్న

పేదల కోసం పనిచేసిన జగనన్న