
కూటమి పాలనలో దగా పడిన అన్నదాత
చిలకలూరిపేట: కూటమి పాలనలో రైతన్నలు అన్ని రకాలుగా దగాకు గురవుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతన్నలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచి పోరాడేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం పట్టణంలోని ఆమె నివాసంలో వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జగనన్న పాలనలో ఆర్‌బీకేల ద్వారా యూరియా, ఇతర ఎరువులను కావాల్సినంత మేర రైతులకు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యూరియా బస్తా కోసం ఎరువుల దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నదాతల సమస్యలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోడవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతాంగం పీకలోతు కష్టాల్లో మునిగి ఉంటే ప్రభుత్వం మాత్రం సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలిచి అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిందని తెలిపారు.
యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం
ఒకవైపు యూరియా కోసం రైతులు బారులు తీరి నిలబడుతుంటే యూరియా కొరత లేదని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. యూరియా కొరత లేకపోతే మరి అవి ఎక్కడికి వెళ్లాయో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం, లేదా నాయకుడు బాగుపడిన దాఖలాలు లేవని విమర్శించారు. అన్నదాత పోరు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు సంఘాల వారు పాల్గొని రైతులకు అండగా నిలుద్దామని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట పట్టణ, మండల, యడ్లపాడు, నాదెండ్ల మండలాల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, వడ్డేపల్లి నరసింహరావు, మంగు ఏడుకొండలు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏకాంబరపు సునీత, నాయకులు ఉడుతా వెంకటేశ్వరరావు, సింగారెడ్డికోటిరెడ్డి, మైలా రాజేష్, సయ్యద్ జమీర్, దాసరి అంజలి, మానుకొండ శేషిరెడ్డి, తాళ్ల అంజిరెడ్డి, కొండవీటి ఆంజనేయులు, రాచమంటి చింతారావు, గుత్తా యాములయ్య, యూసుఫ్ ఆలి, కొప్పురావూరి పటేల్, కొచ్చెర్ల కిషోర్, గౌస్ సంధాని, షేక్ నజీర్, డీలర్ సుభాని పాల్గొన్నారు.