మాచర్ల దోపిడీ కేసు ఛేదన | - | Sakshi
Sakshi News home page

మాచర్ల దోపిడీ కేసు ఛేదన

Sep 7 2025 7:46 AM | Updated on Sep 7 2025 7:46 AM

మాచర్ల దోపిడీ కేసు ఛేదన

మాచర్ల దోపిడీ కేసు ఛేదన

మంగళగిరి, గుంటూరుకు చెందిన తొమ్మిది మంది నిందితులు అరెస్ట్‌ రూ.5లక్షల నగదు, రెండు కార్లు, మూడు కత్తులు స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు

నరసరావుపేట రూరల్‌: మాచర్లలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి రూ.5లక్షల నగదుతో పాటు రెండు కార్లు, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురజాల డీఎస్పీ బీఎల్‌ఎన్‌ జగదీష్‌తో కలిసి మీడియాకు తెలియజేశారు. మాచర్లలో ఈనెల ఒకటో తేదీన దోపిడీ జరిగింది. కారులో వచ్చిన దుండగులు మంగళగిరికి చెందిన అవ్వారు మహేష్‌బాబును కత్తులతో బెదిరించి రూ.5లక్షలు ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడు మాచర్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. డీఎస్పీ జగదీష్‌ ఆధ్వర్యంలో సీఐ పి.ప్రభాకరరావు, ఎస్‌ఐ వెంకట్రావులు తమ సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో పాటు ఘటనా స్థలంలోని భౌతిక ఆధారాలు పరిశీలించి నిందితులను గుర్తించారు.

తొమ్మిది మంది అరెస్ట్‌..

దోపిడీ కేసులో మంగళగిరి, గుంటూరుకు చెందిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో మహిళ కూడా ఉంది. మంగళగిరి దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన కర్నె రాము ప్రధాన నిందితుడు కాగా గుంటూరుకు చెందిన ఫణీంద్రపు మహిమ క్రాంతి, మోదుకూరి ప్రసన్నబాబు, వల్లూరి శ్రీరామ్‌, ఫణిధరపు రాధిక, ఎటుకులపాటి నాగరాజు, సాగిరి వెంకట శివరామకృష్ణ, కొల్లిమర్ల లక్ష్మీబాబు, అందరేకుల లీలా నాగ లోకేష్‌లు అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరిపై గుంటూరు జిల్లాలో పలు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్‌ చేసి న్యామమూర్తి ఎదుట హాజరుపరిచారు.

పథకం ప్రకారం దోపిడీ..

మంగళగిరిలోని లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్‌ కంపెనీ బ్యాంకులో తాకట్టులో ఉన్న బంగారు వస్తువులను కొనుగోలు చేస్తుంటుంది. ఈ కంపెనీలో ప్రధాన నిందితుడు కర్నె రాము గుమస్తాగా పనిచేస్తున్నాడు. మిగిలిన నిందితులతో రాము ముఠాగా ఏర్పడి దోపిడీకి పథకం రచించాడు. మాచర్లలో ముత్తూట్‌ ఫైనాన్స్‌లో 62 గ్రాముల బంగారం ఉందని దీనిని విడిపించాలని లక్ష్మీశ్రీనివాస ట్రేడర్స్‌ యజమానికి గత నెల 31వ తేదీన నిందితురాలు ఫణిధరపు రాధిక చేత ఫోన్‌ చేయించాడు. దీంతో మాచర్ల వెళ్లి నగదు చెల్లించి బంగారాన్ని విడిపించుకురావాలని ఉద్యోగియైన అవ్వారు మహేష్‌బాబుకు యజమాని సూచించాడు. దీంతో రూ.5లక్షల నగదుతో ద్విచక్రవాహనంపై ఈనెల ఒకటో తేదీన మాచర్ల వెళ్లిన మహేష్‌బాబును నాగార్జునసాగర్‌ రోడ్డులోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపైకి రమ్మని నిందితులు చెప్పారు. అక్కడికి వెళ్లిన మహేష్‌బాబుపై నిందితులు తొమ్మిదిమంది దాడిచేసి గాయపరిచి నగదు బ్యాగ్‌తో పాటు సెల్‌ఫోన్‌తో పరారయ్యారు. కేసును ఐదు రోజుల్లో చేధించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐతో పాటు హెడ్‌కానిస్టేబుళ్లు జి.శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వర్లు, టెక్నికల్‌ టీం సభ్యులకు రివార్డులు అందజేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement