
తురకపాలెం మరణాలు ప్రభుత్వ హత్యలే
లక్ష్మీపురం: ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ప్రజల మరణాలు ప్రభుత్వ హత్యలేనని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఆరోపించారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులు ఎక్కువగా వారి కుటుంబ పోషకులను కోల్పోయారని తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందనే విషయానికి ఈ ఘటన తార్కాణం అన్నారు. మృతుల కుటుంబంకు రూ.25 లక్షలు పరిహారంగా చెల్లించాలన్నారు. జిల్లా కార్యదర్శి జె.నవీన్ ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు లూదర్ పాల్, జె.వెంకటస్వామి, సీఐటీయూ గుంటూరు నగర కార్యదర్శి ముత్యాలరావు, షేక్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
తురకపాలెం బాధితులకు రూ.10 లక్షలివ్వాలి
గుంటూరు రూరల్: తురకపాలెంలో ప్రభుత్వ వైఫల్యాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 40 మందికిపైగా మరణించారని, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రభుత్వం అందించాలని జనచైతన్య వేదిక, రేట్ పేయర్స్ అసోసియేషన్, అవగాహన, మానవత, నేస్తం, కొవిడ్ ఫైటర్స్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తదితర పౌర సంస్థల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పౌర సంస్థల ప్రతినిధులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ శనివారం తురకపాలెం మృతుల కుటుంబాలను పరామర్శించింది.
అదుపులోకి పరిస్థితులు
గుంటూరు రూరల్: తురకపాలెం గ్రామంలో పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిరంతరం వైద్య ఆరోగ్య ఇతర సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 895 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 2,850 మందికి ఉపాహారం, 3500 మందికి మధ్యాహ్న భోజనం అందించామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ట్యాంకర్స్ ద్వారా రక్షిత మంచి నీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు.