
పింఛన్ కోసం వెళ్తుంటే ప్రాణమే పోయింది
చికిత్స పొందుతూ మృతి చెందిన ఒంటరి మహిళ
నరసరావుపేట టౌన్: పింఛన్ తీసుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టూటౌన్ ఎస్‌ఐ లేఖ ప్రియాంక శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి మండలం, దూళ్ళిపాళ్ల గ్రామానికి చెందిన ఉర్లగొంట కోటేశ్వరమ్మ (54) గత కొన్ని నెలలుగా నరసరావుపేట మండలం, లింగంగుంట్ల గ్రామంలో ఉంటుంది. ఈ నెల 1వ తేదీన ఒంటరి మహిళ పింఛన్ తీసుకునేందుకు తన సోదరుడి ద్విచక్ర వాహనంపై దూళ్ళిపాళ్ల గ్రామానికి బయలుదేరింది. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు వినాయకుని ఆలయం వద్దకు వచ్చేసరికి వాహనం వెనుక కూర్చున్న ఆమె తూలి కింద పడింది. సంఘటనలో తలకు బలమైన గాయం తగిలింది. క్షతగాత్రురాలిని 108 సహాయంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నకరికల్లు: స్థానిక వంగా వెంకటరెడ్డి జెడ్పీ హైస్కూల్‌లో ఆట్యా–పాట్యా పల్నాడు జిల్లా జట్టు సెలక్షన్స్ ఆదివారం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ పల్నాడు జిల్లా కార్యదర్శి ఉన్నం రోహిత్ జోయల్ శనివారం తెలిపారు. పురుషుల, మహిళల జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లాలోని అన్నిపాఠశాలల నుంచి సెలక్షన్లకు హాజరుకావచ్చన్నారు. క్రీడాకారులు ఈనెల 25, 26 తేదీలలో నకరికల్లులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు చింతా పుల్లయ్య, 9866925108,జి.ఝాన్సీరాణి 99495 33234 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
గుంటూరు వెస్ట్: రైతులతోపాటు ఇతర రుణాలు ఇచ్చే క్రమంలో బ్యాంకర్లు కొంత ఉదారతతో వ్యవహరించాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్‌లతో సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీసీఆర్సీ కార్డులు అందుకున్న రైతులకు బ్యాంకర్లు రుణాలు తప్పనిసరిగా మంజూరు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. అనంతరం రుణాల యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్నం మహిపాల్ రెడ్డి, ఇండియన్ బ్యాంక్ డీజీఎం గౌరీ శంకర్, ఆర్బీ ఎల్డీఓ గిరిధర్, నాబార్డ్ డీడీఎం శరత్ బాబు పాల్గొన్నారు.
మేడికొండూరు : గుంటూరు జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీన మేడికొండూరు మండలం కొరప్రాడులోని క్రీడా ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయని అసోసియేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అనిల్ తెలిపారు.