
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తెనాలి రూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలకలూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనాస్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. మృతుడు లేత ఆకుపచ్చ చొక్కా, తెలుపు మీద ఎరుపు, నలుపు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద టర్కీ టవల్ ఉండడంతో రైతు అయి ఉంటాడని భావిస్తున్నారు. ఛిద్రమైన మృతదేహం భాగాలను తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిసిన వారు 7207076614 నంబరులో సంప్రదించాలని ఎస్‌ఐ జి. వెంకటాద్రిబాబు సూచించారు.
గుండెపోటుతో వ్యక్తిమృతి
బొల్లాపల్లి: వెల్లటూరులో శుక్రవారం జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌పార్టీ కార్యకర్త గంగనబోయిన గోవిందరాజులు (29) శుక్రవారం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు గోవిందరాజులుకు భార్య భూలక్ష్మితోపాటు ఇరువురు సంతానం ఉన్నారు. మృతుని కుటుంబాన్ని స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు పరామర్శించారు.
పెదకాకాని: జర్మనీలోని అతి పెద్ద నైపుణ్య శిక్షణ సంస్థ డెక్రా అకాడమీ ప్రతినిధులు మండలంలోని నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయంలోని సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర యువతలో నైపుణ్య కార్యక్రమాలను మెరుగుపరచడానికి, ప్రపంచ ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు గాను నియమితులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (అంతర్జాతీయ నైపుణ్య, ఉద్యోగ కల్పన) సీతాశర్మతో కలసి శుక్రవారం యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థులకు అందించే శిక్షణ గురించి సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ రావెల నవీన్ బృందానికి వివరించారు. సీతాశర్మ మాట్లాడుతూ జర్మనీ ప్రస్తుతం నైపుణ్యం గల నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని తెలిపారు. నిర్మాణం, ఇంజినీరింగ్, సమాచార సాంకేతిక వంటి రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. ఇండో జర్మన్ సమష్టి కృషితో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు శిక్షణను అందించడం ద్వారా అంతర్జాతీయ నియామకాలు అందించవచ్చని సూచించారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య