
వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత
●వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై దాడులు
●మాజీ ఎమ్మెల్యే బొల్లా కారు డ్రైవర్‌తో పాటు పలువురిపై విచక్షణారహితంగా దాడులు
శావల్యాపురం: వినాయక నిమజ్జనం సందర్భంగా పల్నాడు జిల్లా కారుమంచి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. నిమజ్జనం సందర్భంగా 100 మందికిపైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గురువారం టీడీపీ అబిమానులు ఏర్పాటు చేసిన విగ్రహం నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు గ్రామంలోని సత్రంబజారు ప్రధాన సెంటరులోని వైఎస్సార్ విగ్రహం వద్ద రెండు గంటల పాటు రెచ్చగొట్టే విధంగా హంగామా చేయడంతోపాటు అటువైపుగా వెళుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారు డ్రైవర్ వేమూరి శ్రీకాంత్ పై దాడి చేశారు. అనంతరం, బండారుపల్లి వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పరిస్థితిని అదుపుచేయలేక చేతులెత్తేశారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు జరగటంతో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేశారు.