
కుళాయిల్లో కలుషిత నీరు సరఫరా
రేపల్లె: రేపల్లె పట్టణంలోని 24వ వార్డు నేతాజీనగర్ వాసులు గురువారం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మున్సిపల్ పైపుల ద్వారా తాగునీటి బదులు కలుషిత నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరఫరా అయిన నీటిలోనుంచి భరించలేని దుర్గంధం వెదజల్లుతుండటంతో తాగడానికి గానీ, వాడుకోవడానికి గానీ పనికిరాకపోయిందని కాలనీవాసులు వాపోయారు. రోజుకు ఒకసారి ఇచ్చే నీరు కూడా ఇలా కలుషితమై వస్తే తమ కుటుంబ అవసరాలు ఎలా తీర్చుకోవాలంటూ ప్రజలు ప్రశ్నించారు. కనీసం వాడుకోవడానికి ఒక బిందె కూడా శుభ్రమైన నీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు మాట్లాడుతూ నేతాజీనగర్ సమీపంలోని వాడ మురుగు డ్రైన్‌లో బుధవారం పొక్లెయిన్‌తో పూడికతీత పనులు జరుగుతున్న సమయంలో పైపులు దెబ్బతిన్నాయని, అందువల్లే మురుగు నీరు సరఫరా లైన్లలోకి చేరిందన్నారు. సమస్యను గుర్తించి పైపు లీకేజీని సరిచేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.