
రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతి
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేరికపూడి గ్రామానికి చెందిన ఆర్.వెంకటేశ్వర్లు(70), కుమారుడు భార్గవ్(23)లు మంగళవారం ద్విచక్రవాహనంపై పెట్రోలు బంకు వద్దకు బయలు దేరారు. మేరికపూడి గ్రామం వద్దకు చేరుకోగానే గుంటూరు నుంచి నరసరావుపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనకభాగం ద్విచక్రవాహనం హ్యాండిల్‌కు తగిలింది. దీంతో వాహనం అదుపుతప్పి రహదారిపై పడిపోవడంతో భార్గవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు తీవ్రగాయలు కావడంతో అతడిని చికిత్సకోసం నరసరావుపేట ప్రభుత్వవైద్యశాలకు తరలించి చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రమాదంపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.