
ఉపాధ్యాయ నియామకాల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలు
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు
నరసరావుపేట ఈస్ట్: డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువాది సుబ్బారావు తెలిపారు. అరండల్‌పేటలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ, మెగా డీఎస్సీలో ర్యాంక్‌లు వచ్చినా కాల్‌లెటర్‌లు రాని అభ్యర్థులు మెరుపు వేగంతో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ నియామకాలలో కూటమి ప్రభుత్వం మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ రిజర్వేషన్ కోటాలో కోత కోస్తున్నదని తెలిపారు. మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బిసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరి నుంచి రిజర్వేషన్ కోటాలోకి మార్చటం వలన నిజమైన రిజర్వేషన్ అభ్యర్థులు అనర్హులుగా మారి వందలాది పోస్టులను కోల్పోయారని వివరించారు. జీఓ 77 ప్రకారం రిజర్వేషన్లు వర్టికల్ పద్ధతిలో అమలు చేయాలని స్పష్టం చేసారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ కోటా పోస్టులపై సరైన నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పోరాట సమితి జిల్లా కార్యదర్శి వైదన వెంకట్ పాల్గొన్నారు.