
రేషన్ బియ్యం.. రైట్ రైట్!
అంతా వారే చూసుకుంటారు
జిల్లాలో యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణకు వెళ్తున్న పేదల బియ్యం
పొందుగల, తంగెడ, సాగర్ చెక్‌పోస్టుల మీదుగా వెళ్తున్న లారీలు
రేషన్ మాఫియాతో కుమ్మకై ్కన
ఏపీ చెక్‌పోస్టుల సిబ్బంది
వందల మీటర్ల దూరంలోని తెలంగాణ చెక్‌పోస్టు వాడపల్లి వద్ద పట్టుబడుతున్న పీడీఎస్ బియ్యం
లారీలు సరిహద్దు దాటించేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లు
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతి నెలా వేల టన్నుల బియ్యం జిల్లా సరిహద్దుల మీదుగా తెలంగాణ రాష్ట్రానికి తరలివెళుతోంది. జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల సిబ్బంది లారీలను పట్టుకోకపోగా.. రైట్ రైట్ అంటూ రాష్ట్ర సరిహద్దులను దగ్గరుంచి దాటిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పేదల బియ్యంతో వ్యాపారం చేస్తున్న అక్రమార్కులకు స్థానిక పౌరసరఫరాలు, విజిలెన్స్, పోలీసు అధికారులు అండగా నిలుస్తుండటంతో మరింత రెచ్చిపోయి పట్టపగలే సరిహద్దులు దాటిస్తున్నారని సమాచారం.
పల్నాడులో పట్టుకోరంతే...!
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని రేషన్ బియ్యాన్ని స్థానిక డీలర్ల నుంచి రేషన్ మాఫియా కిలో సుమారు రూ.14 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని వినుకొండ, సంతమాగులూరు, పిడుగురాళ్ల, సత్తెనపల్లి పరిధిలోని రైస్ మిల్లులలో పాలిష్ చేసి సంచులను మారుస్తున్నారు. సదరు మిల్లులపై దాడులు చేసి పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న దాఖలాలు లేవు. పాలిష్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.36 వరకు ఒడిశా, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఎక్కువ భాగం బియ్యం లారీలు తొలుత తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. పల్నాడు జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులైన పొందుగల, తంగెడ, నాగార్జునసాగర్‌ల మీదుగా తెలంగాణ లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ చెక్‌పోస్టుల మీదుగా పీడీఎస్ బియ్యం లారీలు వెళ్తున్నా పట్టుకుంటున్న దాఖలాలు లేవు. రేషన్ మాఫియా వాళ్లలో వాళ్లకు గొడవలు వచ్చి పట్టిస్తున్న అరకొర సరకు తప్ప పెద్ద మొత్తంలో వెళ్తున్న బియ్యం లారీలు దర్జాగా సరిహద్దులు దాటేస్తున్నాయి.
తెలంగాణలో చిక్కేస్తున్నారు...
ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న పీడీఎస్ బియ్యం లారీలు తెలంగాణ చెక్‌పోస్టుల వైపు వెళ్లగానే పట్టుబడిపోతున్నాయి. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్టు నుంచి దర్జాగా వెళ్లిన బియ్యం లారీలు వందల మీటర్ల దూరంలో కృష్ణానది అవతల ఉన్న తెలంగాణ పరిధిలోని వాడపల్లి చెక్‌పోస్టులో పట్టుబడుతున్నాయి. జూలై 4న వాడపల్లి అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద 600 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో వెళ్తున్న రెండు లారీలను సాధారణ తనిఖీలలో పట్టుకున్నారు. ఆ లారీలను పొందుగల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోలేదు. గత నెల 5వ తేదీన మరోసారి అదే చెక్‌పోస్టులో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తెలంగాణ పోలీసులు సీజ్ చేశారు. ఈ లారీ గుంటూరు జిల్లా చేబ్రోలు నుంచి పల్నాడు జిల్లా మీదుగా పొందుగల చెక్‌పోస్టు దాటుకొని తెలంగాణలో ప్రవేశించింది. ఏ ఒక్క అధికారి దీన్ని ఆపిన పాపన పోలేదు. తెలంగాణ బోర్డర్‌లో దొరికిన అవే బియ్యం లారీలు నిమిషాల వ్యవధిలో అర కిలోమీటర్ లోపున్న చెక్‌పోస్టును దాటుతుంటే ఎందుకు పట్టుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చెక్‌పోస్టు సిబ్బంది మొదలు అధికారుల వరకు రేషన్ మాఫియా నుంచి లంచాలు తీసుకోవడంతో చూసీచూడనట్టు వదిలేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ మాఫియా అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారికి ప్రభుత్వ అధికారుల సహకారం ఉండటంతో మరింత రెచ్చిపోతున్నారు.
గుంటూరు జిల్లా మొదలు నల్గొండ వరకు పల్నాడు మీదుగా ప్రయాణిస్తున్న పీడీఎస్ బియ్యం లారీలను ఏ చెక్‌పోస్టులో అడ్డుకోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లు పనిచేస్తున్నారు. రైస్ మిల్లుల నుంచి అంతర్రాష్ట్ర మాఫియాకు బియ్యం అప్పగించేవరకు వీరు రూట్ ఆఫీసర్లుగా పనిచేస్తారు. పోలీసులతో సన్నిహితంగా ఉంటూ వారికి నెలవారీ మామూళ్లు అప్పగించి లారీలను ఆపకుండా చూడటం ఈ ఏజెంట్ పని. స్టేషన్, అధికారిస్థాయిని బట్టి నెలకు రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల దాకా మామూళ్లు ఇస్తున్నట్టు గత నెలలో అరెస్టయిన ఏజెంట్ వాంగ్మూలంలో బయటపెట్టినట్లు భోగట్టా. తెలంగాణ పోలీసులకు సైతం లంచాలు ఇస్తూ లారీలు దాటిస్తున్న ఏజెంట్‌లకు నెలకు రూ.2 లక్షల దాకా మిగులుతున్నట్టు తెలుస్తోంది.