
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన
బెల్లంకొండ: మండలంలోని పలు గ్రామాల్లో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ సాగు క్షేత్రాలను సోమవారం శాస్త్రవేత్తల బృంద సభ్యులు పరిశీలించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమల కుమారి శాస్త్రవేత్తల బృందానికి ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. మండలంలోని నాగిరెడ్డిపాలెంలో రైతు చింతారెడ్డి మహాలక్ష్మి వరి పొలంలో సాగు చేస్తున్న నాలుగు పద్ధతులను శాస్త్రవేత్తలకు వివరించారు. గ్రామంలోని ప్రకృతి వనరుల కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు అందజేస్తున్న కషాయాలు, ద్రావణాల గురించి ప్రాజెక్టు మేనేజర్ తెలియజేశారు. బీజామృతం తయారీ విధానాన్ని లైవ్ డెమో నిర్వహించి, విత్తన శుద్ధి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మండలంలోని చండ్రాజుపాలెంలో రొయ్యల మంగమ్మ సాగు చేస్తున్న కూరగాయలు, ఏటీఎం మోడల్‌లో సాగు విధానాలను పరిశీలించారు. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే రసాయనాలను వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో లీడ్ ప్రిన్సిపల్ సైంటిస్టులు నాగ మాధురి, శ్రీలేఖ, యూఏఎస్ మాజీ వైస్ చాన్స్‌లర్ రాజేంద్రప్రసాద్, క్రోసూరు డివిజన్ ఏడీఏ మస్తానమ్మ, అడిషనల్ డీపీఎం ప్రేమ్ రాజ్, వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో పర్యటించిన శాస్త్రవేత్తల బృందం