పండగలోనూ పోలీస్‌ ‘పచ్చ’పాతం | - | Sakshi
Sakshi News home page

పండగలోనూ పోలీస్‌ ‘పచ్చ’పాతం

Sep 1 2025 2:59 AM | Updated on Sep 1 2025 2:59 AM

పండగల

పండగలోనూ పోలీస్‌ ‘పచ్చ’పాతం

కూటమి సర్కారుకు సాగిలపడుతున్న పోలీసు అధికారులు వినాయక నిమజ్జనంలోనూ అధికార పార్టీ నేతలపై ప్రేమ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రం అడ్డగోలు ఆంక్షలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవమానపరుస్తున్న అధికారులు

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌: కూటమి పాలనలో వినాయక విగ్రహాల విషయంలోనూ పోలీసుల పక్షపాత వైఖరి మారడం లేదు. టీడీపీ నాయకుల మాటే తమకు శాసనమంటున్నారు. రాజ్యాంగబద్ధంగా తాము పని చేయబోమని తేల్చేస్తున్నారు. కూటమి నాయకుల మాటే తమకు వేదం అంటూ పల్నాడు జిల్లాలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇదే కోవలో వారి తీరుకు నిదర్శనంగా నిలిచే ఘటన గురుజాల నియోజవర్గంలోని పిడుగురాళ్లలో జరిగింది.

అనుమతి ఇచ్చింది వారేగా..

వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు ముందే ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్రతిమకు, ఊరేగింపునకు, డీజేకి అనుమతి తీసుకోవాలని చెప్పారు. పిడుగురాళ్ల టౌను, మండలం పరిధిలోనే గ్రామాలలో ఉన్న ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆ మేరకు అనుమతులు తీసుకున్నారు. ఏ పోలీసులైతే అనుమతి ఇచ్చారో వారే ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకులు చెప్పిన మండపాలు, విగ్రహాలు, డీజే ఊరేగింపులకు అవకాశం ఇస్తున్నారు. పండగల సంస్కృతి, సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం తన రాజకీయాలతో కలుషితం చేస్తోంది. ఓ పక్క సనాతన ధర్మం తమదే , దేవుడిపై నమ్మకం తమకే ఉందంటూ వినాయక విగ్రహాల నిమజ్జనంలోనూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. దీనికి పోలీసులు తమవంతుగా సాగిలపడుతున్నారు.

వైఎస్సార్‌సీపీ వారే లక్ష్యం

మండలంలోని పలు గ్రామాలలో అన్ని పార్టీల వారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అనుమతులు ఉన్నప్పటికీ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రతిమలకు మాత్రమే అడ్డగోలు నిబంధనలు విధించారు. కనీసం డీజిల్‌ పెట్టుకొని వినాయకుని నిమజ్జనం చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. తాము పార్టీ పాటలు పెట్టబోమని చెప్పినా తమపై ఒత్తిడి ఉందని పోలీసులు అంగీకరించడం లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన విగ్రహాల ఊరేగింపులో డీజేలు, నాయకుల బొమ్మలు, పార్టీ జెండాలు కనిపిస్తున్నా వారిని ఒక్క మాట కూడా అనడం లేదు. కూటమి నేతలైన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కటౌట్లతో వినాయక నిమజ్జనం ఊరేగింపులో పచ్చ నేతలు నానాయాగీ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ వాడిన డైలాగులను పదేపదే పెట్టినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు.

అక్రమ కేసులు పెట్టడం, స్టేషన్‌కు తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయటం ఇప్పటివరకు కూటమి పాలనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పండగ వేడుకల్లో కూడా అదే ‘పచ్చ’పాతం చూపుతున్నారు. అధికార పార్టీ నేతలకు సాగిలపడి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తున్నారు. వినాయక చవితి వేడుకల్లో వైఎస్సార్‌సీపీ వారిపై అడ్డగోలు ఆంక్షలు విధించడమే దీనికి నిదర్శనం

పచ్చనేతలు చెబితేనే అనుమతి

గ్రామాలలో ఏ పార్టీ వారైనా విగ్రహ ఊరేగింపునకు స్థానిక టీడీపీ లీడర్లు చెబితేనే పర్మిషన్‌ ఇస్తామని పోలీసులు బహిరంగంగానే చెప్పటం ఆశ్చర్యకరంగా ఉంది. రూ.లక్షలు పెట్టి పండగ చేసుకుంటుంటే ఈ రాజకీయాలు ఏంటని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీకి ఒక రకంగా, వేరొక పార్టీకి మరోవిధంగా చట్టాలు ఉంటాయా? అని పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఒకే పోలీస్‌స్టేషన్‌ కదా.. మరి ఈ పక్షపాత ధోరణి ఎందుకని నిలదీస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో ఇలాంటివి ఎప్పుడూ ఎక్కడా జరగలేదని గుర్తుచేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పిడుగురాళ్ల టౌన్‌లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విగ్రహాల ఊరేగింపులో భారీ శబ్దాలతో డీజే ఏర్పాటు చేశారు. మరి అదే టౌన్‌లో పల్నాడు హాస్పిటల్‌ వారు ప్రభుత్వానికి రూ.600 చలానా కట్టి పర్మిషన్‌ తీసుకున్నా పైనుంచి ఒత్తిడి అంటూ డీజేకు పర్మిషన్‌ ఇవ్వలేదు. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతల కోసం మాత్రమే విధులు నిర్వహిస్తున్నారా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వారికి ప్రత్యేకమైన చట్టం ఏమైనా చేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చవితి వేడుకల్లో వైఎస్సార్‌సీపీ వారికే అడ్డగోలు నిబంధనలు

పండగలోనూ పోలీస్‌ ‘పచ్చ’పాతం 1
1/1

పండగలోనూ పోలీస్‌ ‘పచ్చ’పాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement