రోడ్డు ప్రమాదంలో రైతు మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో రైతు మృత్యువాత

Sep 1 2025 2:59 AM | Updated on Sep 1 2025 2:59 AM

రోడ్డు ప్రమాదంలో రైతు మృత్యువాత

రోడ్డు ప్రమాదంలో రైతు మృత్యువాత

రోడ్డు ప్రమాదంలో రైతు మృత్యువాత ద్విచక్ర వాహనం ఢీకొని చిరు వ్యాపారి మృతి డివైడర్‌ను బైకు ఢీకొట్టి యువకుడు దుర్మరణం రాళ్ల ట్రాక్టర్‌ బోల్తా

కర్లపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. కర్లపాలెం ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాల మేరకు... కాకుమానుకు చెందిన దొప్పలపూడి చంద్రపాల్‌(61) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం వరినారు కోసం ద్విచక్రవాహనంపై బాపట్ల మీదుగా కర్లపాలెం వస్తున్నాడు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్‌ ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో చంద్రపాల్‌ తీవ్రంగా గాయపడటంతో అతనిని మొదటిగా బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో చంద్రపాల్‌ మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని కుమారుడు అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రవీందర్‌ తెలిపారు.

కొల్లూరు: అతి వేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ చిరు వ్యాపారి తీవ్రంగా గాయపడి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మండలంలోని బొద్దులూరుపాడుకు చెందిన కొల్లూరు వెంకట నరసయ్య (68) గ్రామంలో కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం కొల్లూరులో సామగ్రిని కొనుగోలు చేసుకొని, మోపెడ్‌పై గాంధీనగర్‌లో నివసిస్తున్న కుమార్తెను చూసేందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తెనాలి వైపు నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనదారుడు నరసయ్య వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుమార్తె 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి నరసయ్య మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన నివేదిక మేరకు కొల్లూరు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ జానకీ అమరవర్ధన్‌ తెలిపారు.

తెనాలి రూరల్‌: డివైడర్‌ను ఢీకొట్టి యువకుడు మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి దాటాక తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ మారిస్‌పేట నిజాంపట్నం కాల్వ కట్టపై నివసించే అన్నపురెడ్డి పవన్‌(21) బైక్‌పై వెళుతూ కొత్త వంతెన వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారంచేడు: మార్టూరు నుంచి చీరాలకు సరిహద్దు రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. ఆదివారం వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలో.. కారంచేడు అంబేడ్కర్‌ నగర్‌ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్‌ ట్రక్కు వెనుక టైర్లకు ఉండే బేరింగ్‌లు ఊడిపోవడంతో ట్రక్కు ఒక్క సారిగా తిరగబడింది. ఆ సమయంలో ఇతర వాహనాలు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్‌ కూడా నిధానంగా ప్రయాణిస్తుండటంతో కేవలం ట్రక్కు మాత్రమే బోల్తా పడింది. దీంతో రాళ్లు ప్రధాన రహదారిలో పడటంతో వాహన ప్రయాణాలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఏఎస్‌ఐ శేషసాయి తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement