పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి

Sep 1 2025 2:59 AM | Updated on Sep 1 2025 2:59 AM

పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి

పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ

మాజీ మంత్రి డొక్కా,

టీటీడీ బోర్డు సభ్యుడు జంగా హాజరు

నరసరావుపేట: జిల్లా సరిహద్దుల మార్పు, పేర్ల మార్పు దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని శాసనసభ్యుడు డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. స్థానిక ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) భవనంలో ఆదివారం పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరుతూ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను అధ్యక్షత వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ చదలవాడ మాట్లాడుతూ వినుకొండ సమీపంలోని చాట్రగడ్డపాడు గ్రామంలో జన్మించిన నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, పద్మభూషణ్‌ లాంటి బిరుదులు గుర్రం జాషువా పొందారన్నా రు. చిన్నతనం నుంచి పేదరికం, అంటరానితనం మధ్య పెరిగి సమాజంలో రుగ్మతలపై అనేక పుస్తకాలు, కావ్యాలు రచించారని గుర్తుచేశారు. నాటక రంగం, సినీ రంగాల్లో పనిచేసిన గొప్ప వ్యక్తిగా కీర్తించారు. అటువంటి మహోన్నత వ్యక్తి అయిన గుర్రం జాషువా పేరు జిల్లాకి పెట్టాలన్నారు.

ఆత్మగౌరవం పెంచేలా...

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం గుర్రం జాషువా అన్నారు. కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లాకు లేదా గుంటూరుకు జాషువా పేరు పెట్టాలని సూచించారు. టీటీడీ బోర్డు మెంబరు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా పల్నాడు గుర్రం జాషువా జిల్లా అని లేదా గుర్రం జాషువా పల్నాడు జిల్లా అని పెడితే ప్రజలు ఆమోదిస్తారని అన్నారు. బులియన్‌ మర్చంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయ్‌ కుమార్‌, కన్వీనర్‌ కొరివి వినయ్‌కుమార్‌, గుర్రం జాషువా మనవడు బీఆర్‌ సుశీల్‌కుమార్‌, బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షుడు నలబోతు రాజు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొల్లిపర బాలాజీ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్‌పాల్‌, ఎంఆర్‌పీఎస్‌ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోదా రమేష్‌కుమార్‌, జన జాగృతి మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు మల్లవరపు బాబు, దళిత కవి డాక్టర్‌ కాకాని సుధాకర్‌, ఎంఏఎం కాలేజ్‌ అధినేత, దళిత నాయకుడు క్రిస్టఫర్‌, ఎస్సీ, ఎస్టీ మాజీ విజిలెన్స్‌ సభ్యులు మరియదాసు, బీసీ నాయకులు బత్తుల వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement