
సమన్వయంతో శంకర్‌విలాస్ వంతెన పనులు
గుంటూరు వెస్ట్: గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ నూతన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సమన్వయంతో వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని చాంబర్‌లో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు కోసం ప్రత్యామ్నాయ రహదారులు సిద్ధం చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మోటార్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 24 గంటలూ సిబ్బంది విధుల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. ఇప్పటికే తొలగించిన ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.