
సీఎంకు చెంచాలుగా ఐపీఎస్‌లు
సత్తెనపల్లి: కొందరు ఐపీఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు చెంచాలుగా వ్యవహరిస్తూ రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. బంగారుపాళ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులపై, కార్యకర్తలపై, రైతులపై, అభిమానులపై రౌడీషీట్ పెడతానని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ బెదిరించడాన్ని ఖండించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అనంతరం ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ... చిత్తూరు ఎస్పీ మణికంఠ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠత్రిపాఠిలు చంద్రబాబుకు చెంచాలేనని ఆరోపించారు. వీరు కాకుండా మరికొంత మంది రిటైర్డ్ అయిన వారు కూడా ఇదే తీరులో మద్దతుగా ఉన్నారన్నారు. వీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది అక్రమమన్నారు. పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా సమాధానం చెబుతామని, కోర్టులో వారి సంగతి తేలుస్తామని పేర్కొన్నారు. కేవలం హరీష్ కుమార్ వర్సెస్ బిహార్ అనే కేసును ఫాలో కాకుండా చేసిన అందరు ఎస్పీల మీద, అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ల మీద కేసులు పెడతామని హెచ్చరించారు. ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎస్పీ మణికంఠ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరంగానే ఆయన అంతు తేలుస్తామన్నారు. తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన అని చంద్రబాబు చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టారన్నారు.
కూటమికి గుణపాఠం తప్పదు...
ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ తమకు కేసులు, పోరాటాలు కొత్తేమీ కాదన్నారు. ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు తెచ్చేలా, నల్లచట్టాలు తీసుకొచ్చి అణచివేయడానికి, నిర్బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తెలిపారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఓటుతో ప్రజలు కూటమికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. గుంటూరులో రెండు, సత్తెనపల్లిలోనూ అక్రమ కేసులు పెట్టారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వానికి లేదన్నారు. మిర్చి, పొగాకు, మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లినందుకే కేసులు పెట్టారన్నారు. వ్యవసాయం దండగ అనేది చంద్రబాబు వైఖరి అని వ్యాఖ్యానించారు. అందుకే రైతులను అణగదొక్కడానికి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. ఎవరైనా నోరెత్తితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
రౌడీల్లా వ్యవహరిస్తున్న పలువురు పోలీసు ఉన్నతాధికారులు అడ్డగోలు కేసులు పెడితే కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తాం మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి
భయపడేదే లేదు...
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ... తమకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ జన సమీకరణ చేశామని పేర్కొంటూ తప్పుడు కేసు పెట్టారన్నారు. తమను అణచివేయాలని, భయపెట్టాలనే ఇలాంటి ప్రయత్నం సరికాదన్నారు. పొన్నూరులో ఒక దళిత సర్పంచ్‌పై, అదీ 60 ఏళ్లుగా రిజర్వేషన్ లేకుండానే రాజకీయంగా పలు పదవులు సొంతం చేసుకున్న కుటుంబంలోని వ్యక్తిపై హత్యాయత్నం చేయించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయంతో అక్కడ కూడా కేసు పెట్టినట్లు తెలుస్తోందన్నారు. ఇలాంటి కేసులకు తాము భయపడేదే లేదన్నారు.