
విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి
సత్తెనపల్లి: క్రమశిక్షణతో ప్రతి విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘మెగా పీటీఎం 2.ఓ’లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చదువుతోనే ఉన్నత స్థానాలకు చేరుకోగలమని పేర్కొన్నారు. కష్టంగా కాకుండా ఇష్టంతో చదవాలన్నారు. తద్వారా తల్లిదండ్రులకు పేరు తేవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. పిల్లల చదువు తీరు గురించి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపారు. అమ్మ పేరుతో మొక్క నాటడమే కాకుండా దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీఈవో ఎల్.చంద్రకళ, సత్తెనపల్లి ఆర్డీఓ జీవీ రమణాకాంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్.ఆనంద్‌కుమార్‌లు కూడా మాట్లాడారు. తల్లిదండ్రుల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులకు పోటీలు పెట్టారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొక్కలు నాటిన విద్యార్థినులకు మొక్కలతోపాటు గ్రీన్ పాస్‌పోర్టు అందించారు. తల్లులకు చిన్నారులు పాదాభివందనం చేశారు. మొక్కలు పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మండల విద్యాశాఖాధికారి–2 ఎ.రాఘవేంద్రరావు, ప్రధానోపాధ్యాయురాలు మాధవీ లత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
పిల్లల చదువుపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం
పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు