
వీధి కుక్కలు .. భౌబోయ్..!
సత్తెనపల్లి: వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై గుంపులుగా కనిపిస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలను వెంబడించి మరీ దాడి చేస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే కొరికేస్తున్నాయి. జిల్లాలో ఏడాది కాలంగా యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం పూర్తిగా నిలిచిపోయింది. వీధి కుక్కల సంతతి విపరీతంగా పెరిగిపోయింది. జన సంచారం లేని రోడ్డు ఉందేమో గానీ.. వీధి కుక్కల సంచారం లేని రోడ్డు లేదంటే అతిశయోక్తి కాదు.
తల్లిదండ్రుల్లో ఆందోళన....
పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చిన్నారుల ను పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను పాఠశాలల్లో వదిలి తల్లిదండ్రులు పొలాలకు వెళ్తుంటారు. దీంతో చిన్నారుల భద్రత మీద ఆందోళన చెందుతున్నా రు. పల్లెల్లో వీధి కుక్కలు బెడద ఎక్కువగా ఉండ డంతో పిల్లలు స్కూల్ నుంచి ఒంటరిగా వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోన ని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.
అటకెక్కిన బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం...
వీధి కుక్కలు పెరగకుండా నియంత్రణకు యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం నిర్వ హించాల్సి ఉంది. మగ కుక్కలకు క్యాస్టేషన్ చేస్తారు. ఆడ కుక్కలకు గర్భసంచి తీసేస్తారు. దీంతో పునరుత్పత్తి జరగదు. క్రమంగా వీధి కుక్కల సంఖ్య తగ్గిపోతుంది. కానీ జిల్లాలో ఎక్కడా ఏబీసీ ప్రోగ్రాం జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. అధికారులు మాత్రం వీధి కుక్కలకు త్వరలో ఆపరేషన్లు చేయిస్తామంటూ చెప్పి తప్పించుకుంటున్నారు. పదే పదే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు ప్రస్తావించినా కనీసం నామ మాత్రంగా కూడా చర్యలు తీసుకోవడం లేదని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.
ప్రాణాంతకంగా మారిన రేబిస్...
కుక్కలు కరిస్తే రేబిస్ సోకే ప్రమాదం ఉంది. కుక్క కాటు వేసిన వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలి. లేకపోతే రేబిస్ బారిన పడితే చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రాణాలకు గ్యారెంటీ చెప్పలేని దుస్థితి. నరాల వ్యవస్థ మొత్తం దెబ్బతిని చివరికి ప్రాణాలు పోతాయి. రేబిస్ సోకిన వారిలో కొందరు మంచినీళ్లు తాగడానికి కూడా భయపడి పోతారు. ఈ లక్షణాన్ని వైద్య పరిభాషలో హైడ్రోఫోబియా అంటారు. నీళ్లు తాగకపోవడంతో డిహైడ్రేషన్ ఏర్పడి మరణానికి గురవుతారు. అందుకే కుక్క కరిచిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) చేయించుకోవాలి. తీవ్రమైన గాయాలైనప్పుడు, పిచ్చి కుక్క కాటు వేసినప్పుడు, కాటు తీవ్రతను బట్టి హిమునోగ్లోబిన్ ఇంజక్షన్ చేస్తారు. దీని వలన తక్షణమే వ్యాధి నిరోధక శక్తి చేకూరుతుంది. అదే ఏఆర్‌వీ వలన వ్యాధి నిరోధక శక్తి సమకూరడానికి మూడు నెలల వరకు పట్టవచ్చు.
జిల్లాలో హడలెత్తిస్తున్న వీధికుక్కలు
రోడ్లపై గుంపులుగా తిరుగుతూ జనంపై దాడులు
ద్విచక్ర వాహనాల వెంట పరుగులు
యువకుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం
రోడ్ల పైకి రావాలంటేనే భయపడుతున్న ప్రజలు