తెల్లపేపర్‌పై జీఎస్టీ వసూలు | - | Sakshi
Sakshi News home page

తెల్లపేపర్‌పై జీఎస్టీ వసూలు

Jul 7 2025 6:17 AM | Updated on Jul 7 2025 6:17 AM

తెల్లపేపర్‌పై జీఎస్టీ వసూలు

తెల్లపేపర్‌పై జీఎస్టీ వసూలు

నరసరావుపేట టౌన్‌: నరసరావుపేటలోని కొన్ని బ్యూటీపార్లర్లలో అనధికార జీఎస్టీ వసూలు చేస్తూ కస్టమర్ల జేబులు గుల్ల చేస్తున్నారు. తాజాగా ఆదివారం పట్టణంలోని అరండల్‌పేటకు చెందిన నేచురల్స్‌ బ్యూటీపార్లర్‌కు ఓ ఉన్నత స్థాయి అధికారిణి వెళ్లారు. అక్కడ సర్వీసు అనంతరం వారు ఇచ్చిన బిల్లు చూసి సదరు అధికారి అవాక్కయ్యారు. ఆ బిల్లులో సర్వీస్‌ ఛార్జీలతోపాటు జీఎస్టీ కూడా కలిపి అధిక మొత్తంలో చేతితో రాసి ఇవ్వడంతో విస్మయం చెందారు. సర్వీస్‌ ఛార్జీలతోపాటు సెంట్రల్‌ జీఎస్టీ 18 శాతం చెల్లించాలంటూ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా జీఎస్టీ ఎలా వసూలు చేస్తారంటూ ఆ అధికారిణి నిర్వాహకులను ప్రశ్నించారు. దీంతో బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలు తమ వద్ద ఇలానే ఉంటుందని దురుసుగా జవాబిచ్చారు. తాము ఇచ్చినంత బిల్లు చెల్లించాల్సిందే అంటూ దౌర్జన్యానికి దిగారు. అప్పటికే సదరు అధికారిణి బిల్లు చెల్లించారు. ఇదేవిధంగా వినియోగదారుల వద్ద అనధికారికంగా జీఎస్టీ వసూలు చేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సదరు అధికారిణి సిద్ధమయ్యారు. అయితే ఆ బ్యూటీ పార్లర్‌ ఓ సీఐకి చెందినదని తెలియ వచ్చింది. నరసరావుపేటలో నిర్వహిస్తున్న కొన్ని బ్యూటీ పార్లర్‌లలో ప్రతినిత్యం ఇలానే అనధికార బిల్లులతో కస్టమర్ల జేబులు గుల్లచేస్తున్నట్లు సమాచారం.

రేపటి లోగా ఎస్సీ విద్యార్థులతో పోస్టల్‌ అకౌంట్‌లు తెరిపించండి

నరసరావుపేట: ఇంటర్మీడియెట్‌ మొదటి ఏడాది చదువుతున్న ఎస్సీ విద్యార్థులతో పోస్టల్‌ అకౌంట్లు మంగళవారంలోపు తెరిపించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఈ.ఈశ్వరమ్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తల్లికి వందనం రెండో విడత నిధులు విడుదలవుతున్న నేపథ్యంలో సహాయ సంక్షేమాధికారులు, కళాశాల కో ఆర్డినేటర్లు, వసతి గృహ సంక్షేమాధికారులు, సచివాలయాల్లో వెల్ఫేర్‌ అసిస్టెంట్లు తమ పరిధిలో అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులను గుర్తించి వారి పోస్టల్‌ అకౌంట్లు ఆధార్‌ నంబర్లకు ఎన్‌పీసీఐ లింకు చేయించాలని సూచించారు. ఇప్పటికే అకౌంట్లు తెరిచిన వారు ఎన్‌పీసీఐతో లింకు పరిశీలించుకోవాలని అన్నారు. తొమ్మిది, పది తరగతులకు చెందిన 70 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్లకు ఎన్‌పీసీఐ లింకు పెండింగ్‌లో ఉందని చెప్పారు. 133 మంది ఇంటర్‌ విద్యార్థుల మ్యాపింగ్‌ కూడా పెండింగ్‌లో ఉందని వివరించారు.

నరసరావుపేటలోని ఓ బ్యూటీ పార్లర్‌ నిర్వాకం

ఇదేమని ప్రశ్నించిన ఓ అధికారిణికి నిర్లక్ష్యపు సమాధానం

తమ వద్ద ఇలానే ఉంటుందంటూ రుబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement