
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రైస్‌మిల్లు దగ్ధం
నకరికల్లు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రైస్‌మిల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన మండలంలోని కుంకలగుంట గ్రామంలో శనివారం తెల్లవారుఝామున జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. షేక్ జాన్‌సాహెబ్, అరవపల్లి ప్రదీప్‌లు భాగస్వామ్యంతో గ్రామంలోని మసీదులైన్‌లో రైస్‌మిల్లు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి కార్యకలాపాలు ముగించుకొని వెళ్లిపోయారు. శనివారం తెల్లవారుఝామున మిల్లులో మంటలు రావడం గమనించిన సమీప గృహాల వారు మిల్లు నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో మిల్లులోని యంత్రాలు, ధాన్యం, బియ్యం బస్తాలు కాలిపోయాయి. ప్రమాదంలో సుమారు రూ.10లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చల్లా సురేష్ కేసు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రూ.10లక్షల మేర ఆస్తినష్టం