నరసరావుపేట టౌన్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం స్థానిక మండల న్యాయ సేవా అధికారులు న్యాయస్థాన భవనం ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13 అదనపు జిల్లా న్యాయ అధికారి ఎన్.సత్యశ్రీ ఆధ్వర్యంలో న్యాయాధికారులు ఆరు బెంచ్‌లుగా ఏర్పడ్డారు. సివిల్, క్రిమినల్, ముందస్తు వ్యాజ్యాలు, అన్ని రకాల కేసులు కలిపి 852 కేసులను పరిష్కరించారు. పరిష్కారమైన కేసుల్లో కక్షిదారులకు రూ. 5,49,30,445ల మేరకు పరిహారం లభించింది. అదాలత్‌లో న్యాయాధికారులు కె.మధుస్వామి, ఎన్.లావణ్య, ఆర్.ఆశీర్వాదం పాల్, ఎ.సలోమి, ఎం.గాయత్రి, లోక్ అదాలత్ సభ్యులు పాల్గొన్నారు.
ఆలయ జీర్ణోద్ధరణకు రూ.లక్ష విరాళం
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డు పులుపులవారి వీధిలో వేంచేసియున్న వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు పట్టణానికి చెందిన లక్ష్మీనరసింహా జువెల్లరీ మార్ట్ అధినేత దద్దాల వెంకటేశ్వరరావు, పుష్పలత దంపతులు రూ.లక్ష విరాళంగా అందించారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దాతలు విరాళం మొత్తాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు వనమా కృష్ణ, వనమా సాంబశివరావు, కోవూరు శివశీనుబాబులకు అందజేశారు.
స్వామివారికి వెండి కిరీటం
గురజాల: పల్నాడు యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో వేంచేసియున్న వేంకటేశ్వర స్వామి వారికి 5 కిలోల వెండి కిరీటాన్ని శనివారం భక్తులు అందించారు. గురజాలకు చెందిన కనిగిరి సాంబశివరావు, గుండా రవితేజ, జూలకంటి మణికుమార్ రెడ్డిలు స్వామి వారికి అందించారు. తొలి ఏకాదశి ముందు రోజు శనివారం స్వాతి నక్షత్రం కావడంతో స్వామి వారికి కిరీటం అందజేశామని దాతలు తెలిపారు. వెండి కిరీటానికి దేవాలయ అర్చకుడు వేణు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజగోపురం తలుపునకు మరమ్మతులు
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానం దక్షిణరాజగోపురానికి అమర్చిన రెండు తలుపుల్లో ఒక తలుపునకు ఉన్న ఇనుపరాడ్ విరిగిపోవటంతో గత బుధవారం రాత్రి ఒరిగిపోయింది. ఈనేపధ్యంలో ఆలయ ఈఓ రేఖ ఆధ్వర్యంలో మంగళగిరి నుంచి తలుపులు మరమ్మతులు చేసే వడ్రంగి నిపుణులను పిలిపించి క్రేన్ సాయంతో మరమ్మతులు పూర్తి చేశారు.