
కోటప్పకొండపై..
నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో విస్త్రృత ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేశారు. ఉచిత, ప్రత్యేక, శీఘ్ర, అభిషేక దర్శనాలను భక్తులకు కల్పించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచారు. అలాగే స్వామి వారి ప్రసాదాలైన లడ్డూ, అరిసెలను సిద్ధం చేశారు. భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు.