గుర్తింపు ఏదీ? | - | Sakshi
Sakshi News home page

గుర్తింపు ఏదీ?

Jul 4 2025 3:48 AM | Updated on Jul 4 2025 3:48 AM

గుర్తింపు ఏదీ?

గుర్తింపు ఏదీ?

సత్తెనపల్లి: జిల్లాలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది కౌలు రైతులకు అందించే సాగుహక్కు ధ్రువీకరణ పత్రాలు(సీసీఆర్‌సీ) అందుతాయో లేదో అన్న బెంగ రైతులను వెంటాడుతోంది. సీసీఆర్‌సీ కార్డు లేకపోతే ప్రయోజనాలు అందవని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో కౌలు రైతులకు అన్ని విధాల మేలు జరిగింది. వారికి సీసీఆర్‌సీ కార్డులు అందజేయడంతో పాటు విత్తనాలు, ఎరువులు కూడా అందించింది. అంతేకాకుండా సాధారణ రైతులకు ఇచ్చిన విధంగా వారికి వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో కౌలు రైతు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

లక్ష్యానికి సుదూరం

ఈ ఏడాది 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 421 రైతుసేవా కేంద్రాల ద్వారా 67 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అయితే ఇంతవరకు కేవలం 8,333 మందికి అంటే కేవలం 12.44 శాతం మందికి మాత్రమే సాగుహక్కు ధ్రువీకరణ పత్రాలు కార్డులు అందాయి. ఇంకా 58,667 మందికి కార్డులు అందించాల్సి ఉంది. జిల్లాలో అత్యధికంగా సత్తెనపల్లి మండలంలో 2,137 మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు పంపిణీ చేయగా.. అత్యల్పంగా పిడుగురాళ్లలో కేవలం ఆరుగురు కౌలురైతులకు మాత్రమే కార్డులు పంపిణీ చేయడం గమనార్హం. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైంది. రైతులు కొన్నిచోట్ల పంటల సాగుకు ఉపక్రమించగా, మరికొన్ని చోట్ల పొలాలను సిద్ధం చేస్తున్నారు. కార్డుల జారీలో ప్రభుత్వం అలసత్వంపై రైతులు ఆవేదన చెందుతున్నారు.

అవగాహన అవసరం

సీసీఆర్‌సీ కార్డుల మంజూరుకు సంబంధించి అసలు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు చొరవ చూపాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ కార్డు వల్ల కౌలు రైతుకు కేవలం 11 నెలల కాలంలో పండించిన పంటపై మాత్రమే హక్కు ఉంటుందని, భూమిపై ఉండదన్న విషయాన్ని వివరించాల్సి ఉంది. కార్డు ఉంటే విపత్తుల వేళ పంట నష్టపరిహారం పొందేందుకు, అలానే ధాన్యం రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు వీలుంటుంది.

జిల్లాలో సీసీఆర్‌సీ కార్డులు జారీ ఇలా ...

డివిజన్‌ లక్ష్యం పంపిణీ పంపిణీ చేయాల్సినవి

చేసినవి శాతం

నరసరావుపేట 26,391 2,516 9.53 23,875

సత్తెనపల్లి 20,728 4,574 22.07 16,154

గురజాల 19,881 1,243 6.25 18,638

మొత్తం 67,000 8,333 12.44 58,667

నత్తనడకన కౌలు రైతుల గుర్తింపు కార్డుల జారీ ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైనా పావు వంతు మందికీ అందించని వైనం జిల్లాలో 2025–26 సీసీఆర్సీ కార్డుల జారీలక్ష్యం 67 వేలు ఈ ఏడాది ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 8వేలే.. జిల్లావ్యాప్తంగా 421 రైతు సేవా కేంద్రాలు

రాయితీ నష్టపోయే ప్రమాదం

పంట కాలం 11 నెలలు కావడంతో బ్యాంకులు, సొసైటీలో రుణాలు తీసుకున్న రైతులు సరిగ్గా 11వ నెలలో తీసుకున్న మొత్తం వడ్డీతో కలిసి చెల్లిస్తే వెంటనే కొత్త రుణం జారీ చేస్తారు. ఆ తర్వాత వడ్డీ రాయితీ బ్యాంకులో జమవుతుంది. అయితే కార్డు జారీ మూడు వారాలు ఆలస్యం కావడంతో జూన్‌ మొదటి మూడు వారాల్లో రుణాలు తీసుకున్న రైతులకు రాయితీ ప్రయోజనం దక్కడం లేదని వాపోతున్నారు. కార్డుల జారీలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కౌలు రైతులందరికీ కార్డులు

జిల్లాలో కౌలు రైతులందరికీ సీసీఆర్‌సీ కార్డులు అందచేస్తాం. పీఎం కిసాన్‌పై దృష్టి పెట్టాం. దీనిని కౌలు రైతులకు కూడా వర్తింప చేయనున్నాం. ఖరీఫ్‌ సీజన్‌కు ఇంకా సమయం ఉంది. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు నమోదు కాని వారి పై ప్రత్యేక దృష్టి పెట్టాం. వెబ్‌లాండ్‌ ద్వారా ఈకేవైసీ అప్‌డేట్‌ చేయాల్సి ఉంది.

–ఎం.జగ్గారావు,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement