
జీఆర్‌ఎఫ్ డీఎస్పీ అక్కేశ్వరరావు
అవసరమైతే కాల్పులు
పిడుగురాళ్ల: రైళ్లలో నేరాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని గుంటూరు డివిజన్ జీఆర్‌ఎఫ్ డీఎస్పీ పి. అక్కేశ్వరరావు హెచ్చరించారు. రైల్వే పోలీస్ స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైళ్లలో నేరాలను అరికట్టేందుకు గుంటూరు డివిజన్లో ఆర్పీఎఫ్, జీఆర్‌ఎఫ్ సంయుక్తంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ ట్రైన్లలో కొద్ది రోజులుగా ఏసీపీ(అలారం చైన్ పుల్లింగ్), సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ ద్వారా వేగంగా వెళ్లే ట్రైన్లను నేరగాళ్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే ఏ బోగీ నుంచి ఈ ట్యాంపరింగ్ జరిగిందనేది తమకు వెంటనే కచ్చితమైన సమాచారం వస్తుందని తెలిపారు. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే వేగంగా వెళ్తున్న ట్రైన్ ఒక్కసారిగా నెమ్మదించడంతో విధుల్లో ఉన్న గుంటూరు డివిజన్‌లోని తెనాలి ఎస్సై వెంకటాద్రి, కానిస్టేబుల్ శేషయ్య, తదితరులు అప్రమత్తం అయ్యారన్నారు. దొంగలు రాళ్లు విసరడంతో ఎస్సై, కానిస్టేబుల్ కాల్పులు జరిపారని తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని తనతోపాటు గుంటూరు డివిజన్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బి.శైలేష్ కుమార్ పరిశీలించారని తెలిపారు. డీఐజీ ఉత్తర్వుల మేరకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, నెల్లూరు తదితర ప్రాంతాలకు పంపినట్లు పేర్కొన్నారు. దుండగులను పట్టుకొని చట్టపరంగా తగిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. దోపిడీలు, దొంగతనాలకు పాల్పడితే కాల్పులు జరిపైనా ప్రయాణికులకు రక్షణ కల్పిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకుండా కాపాడటమే తమ విధి అన్నారు. కార్యక్రమంలో గుంటూరు అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బి.శైలేష్ కుమార్, జీఆర్‌పీ సీఐ పి.కరుణాకర్ రావు, ఎస్‌ఐలు హుస్సేన్, మోహన్, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.