
కూటమి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
నరసరావుపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ముఖ్యంగా మహాత్మాగాంధీ గ్రామీణ పనికి ఆహార పథకం (ఎన్‌ఆర్‌ఇజీఎస్)లో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు ఆ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో నెలకొన్న అనేక సమస్యలపై పార్టీకి చెందిన సర్పంచులు, నాయకులతో కలిసి నరసరావుపేటలోని కలెక్టరేట్‌కు వచ్చారు. పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పనికి ఆహార పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు డబ్బులు ఇవ్వకుండా దోచుకుంటున్నారని, కూలీలకు ఇచ్చే రూ.300లో సగం తమకు ఇవ్వమని ఫీల్డ్ అసిస్టెంట్లు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఫోన్‌లో ఏవిధంగా బెదిరించారో ఆ వీడియో, ఆడియో పెద్ద ఉదాహరణ అన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1150 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ నిధులను పంచాయతీలకు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం వివిధ పథకాల కోసం వాడుకుంటుందన్నారు. నిధులు లేక పంచాయతీలలో లైట్లు, శానిటేషన్, తాగునీటి సరఫరా, జీతాలు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. సర్పంచులు ఎంపీటీసీలకు, గౌరవవేతనం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రంలో 80 శాతం పంచాయతీలో వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్‌లు ఉన్నారని, పంచాయతీ సెక్రటరీలను అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు తీర్మానాలు చేయించకుండా, పనులు చేయకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం రూ.3వేలు గౌరవ పొందుతున్న సర్పంచ్‌లకు తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేయకుండా కూటమి అన్యాయం చేసిందన్నారు. గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీలు 1350 మందికి ఇంతవరకు పోస్టింగులు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు ఆలా లక్ష్మీనారాయణ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పడాల చక్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పచ్చవ రవీంద్రబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల శివారెడ్డి, మండల అధ్యక్షులు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు ముండ్రు హరినారాయణ, అమరావతి మండల సేవాదళ్ అధ్యక్షులు వైఎన్ పాపారావుయాదవ్, పార్టీ నరసరావుపేట మండల కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావు, అన్ని గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1150 కోట్ల నిధులను తక్షణమే చెల్లించాలి
గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలి
కలెక్టర్‌కు విన్నవించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగ నాయకులు, సర్పంచ్‌లు