
చిరుద్యోగులపై కక్ష సాధింపు
విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లపై కూటమి ప్రభుత్వం వేటు
కక్షతో తొలగించారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నా సోదరుడు రషీద్‌ను వినుకొండ పట్ణణం నడిబొడ్డులో టీడీపీ గుండాలు నరికి చంపారు. ఇప్పటి వరకు నా కుటుంబానికి న్యాయం జరగలేదు. దీనిపై కోర్టులో పోరాడుతున్న నన్ను వేధించేందుకు కూటమి నేతలు తంగెడ సబ్ స్టేషన్‌లో 2010 నుంచి షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నన్ను తొలగించారు. అక్రమ కేసును బూచిగా చూపి నాపై కక్ష తీర్చుకుంటున్నారు. నాకు, నాకుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాను.
–ఎస్‌కే ఖాధర్ బాషా, తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్, వినుకొండ
సాక్షి, నరసరావుపేట: బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. గత ప్రభుత్వంలో నియామకాలు జరిగాయన్న ఒకే ఒక్క సాకుతో వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, డీఆర్‌డీఏ అనుబంధ సిబ్బంది, రేషన్ డీలర్లు, ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే ఎండీయూ వాహన సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు, మార్కెట్‌యార్డు సిబ్బంది ఇలాంటి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూటమి నేతల ప్రోద్బలంతో తొలగించారు. ఇదే కోవలో విద్యుత్ సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వారిపై వేటు వేసి వేధిస్తోంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించి కూటమి నేతలు సిఫార్సు చేసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అకస్మాతుగా ఉద్యోగాల నుంచి తొలగించడంతో షిఫ్ట్ ఆపరేటర్లు దిక్కుతోచన స్థితిలోకి వెళ్లి మానసికంగా కృంగిపోతున్నారు. ఏ తప్పు చేయకపోయినా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నారు. ఉద్యోగాల నుంచి తొలగించడంతో కుటుంబంలో సమస్యలు పెరిగి కాపురాలు కూలిపోతున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై బలవన్మరణాల వరకు వెళుతున్నారు.
రూ.లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంటూ...
విద్యుత్ సబ్‌స్టేషన్లలో తొలగిస్తున్న ఉద్యోగాలు ముఖ్యంగా సత్తెనపల్లి, వినుకొండ నియోజకవర్గాలలో ఎక్కువగా ఉంటున్నాయి. ఆయా నియోజకవర్గాలలో కూటమి నేతలు ఈ వేధింపులు అధికంగా చేస్తున్నారని ఉద్యోగాలు కోల్పోయిన ఆపరేటర్లు వాపోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏ సబ్‌స్టేషన్ నుంచి ఎవరిని తొలగిస్తున్నారు, వారి స్థానంలో కొత్తగా తీసుకుంటున్న వ్యక్తి ఎవరు, అతన్ని సిఫార్సు చేస్తున్న నేతల పేర్లతో కూడిన జాబితా సైతం తయారుచేశారు. ఇది బహిర్గతం అవ్వడంతో ఏ స్థాయిలో కూటమి నేతలు అరాచకం సృష్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తొలగించిన స్థానాల్లో కొత్తవారిని నియమించేందుకు కూటమి నేతలు రూ.4–5 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.
ఆత్మహత్యలే శరణ్యం...
ఐదేళ్లుగా చేజర్ల విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నన్ను ఏ కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల వద్ద గోడు వెలిబుచ్చినా పట్టించుకున్న నాథుడు లేడు. పార్టీల పేరుతో బడుగు బలహీనవర్గాలకు చెందిన మాపై కూటమి నేతుల కక్షకట్టి ఉద్యోగాలు తొలగించి జీవితాలను రోడ్డు పాల్జేశారు. మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం.
–బనావతు రవినాయక్, తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్, చేజర్ల సబ్‌స్టేషన్
వైఎస్సార్ సీపీ సానుభూతిపరులన్న సాకుతో...
విద్యుత్ సబ్‌స్టేషన్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడక ముందే షిఫ్ట్ ఆపరేటర్లుగా జిల్లాలో 200 మందికి పైగా పనిచేసేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారిని ఎవర్ని తొలగించే కార్యక్రమం చేపట్టలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నియామక పరీక్షలో షిఫ్ట్ ఆపరేటర్లకు కొంత ప్రాధాన్యత ఇవ్వడంతో సుమారు 40 మంది దాకా జీఎల్‌ఎంలుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈ క్రమంలో ఖాళీ అయిన పోస్టులలో మాత్రమే వైఎస్సార్‌సీపీ నియామకాలు చేపట్టింది. ఇందులో పార్టీలు, వర్గాలు చూడకుండా అర్హులైన బడుగు, బలహీన వర్గాలకు ఉద్యోగాలు కల్పించారు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం రాగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియామకాలు పొందిన వారిపై కూటమి నేతలు కక్షకట్టారు. వారందరిని విద్యుత్ శాఖ అధికారుల ద్వారా ఒత్తిడి చేయించి ఉద్యోగాల నుంచి ఒక్కొక్కరుగా తొలగించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 40 మందిని తొలగించినట్టు సమాచారం. ఇదే క్రమంలో శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఉయ్యాల తిరుపతిరావు(30) 2019లో వేల్పూరు విద్యుత్ సబ్‌స్టేషనులో కాంట్రాక్టు ఉద్యోగిగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తిరుపతిరావుకు తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన స్వాతితో మూడేళ్ల కిందట వివాహమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతిరావుపై అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి తిరుపతిరావు ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. ఒకవైపు ఉపాధి కోల్పోయి, మరోవైపు కుటుంబంలో కలతలు రావటం భార్యాభర్తల మధ్య విభేదాలు రావటంలో తిరుపతిరావు ఆదివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది కూటమి ప్రభుత్వ హత్యేనని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు, ఉద్యోగాలు కోల్పోయిన షిఫ్ట్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు.

చిరుద్యోగులపై కక్ష సాధింపు

చిరుద్యోగులపై కక్ష సాధింపు