
జిల్లాలో 65.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
నరసరావుపేట: జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో కేవలం తొమ్మిది మండలాల్లో 65.2 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. అత్యధికంగా పెదకూరపాడులో 17.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా గురజాల 4.8, దాచేపల్లి 3.4, అచ్చంపేట 6.2, క్రోసూరు 5.4, అమరావతి 16.8, సత్తెనపల్లి 4.6, రాజుపాలెం 2.4, నరసరావుపేట 4.4 మి.మి వర్షం కురిసింది.
రోడ్డు ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ మృతి
రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామ సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ మృతి చెందాడు. రాత్రివేళ హైవేపై వేగంగా వెళ్తున్న సిమెంట్ కంటైనర్ బ్రేక్ వేయడంతో అదే మార్గంలో వెనుక వస్తున్న గూడ్స్ కంటైనర్ ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలు నకరికల్లు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గూడ్స్ కంటైనర్ డ్రైవర్ రెండు లారీల మధ్య ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ అధికారులు, రొంపిచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీతో లారీని తొలగించి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు. గాయాలతో ఉన్న గూడ్స్ కంటైనర్ డ్రైవర్‌ను హైవే అంబులెన్స్ వాహనంలో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. రొంపిచర్ల ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాన నీటితో ధ్యాన బుద్ధుడు విగ్రహానికి ముప్పు
అమరావతి: రాజధానిలో ఐకాన్‌గా గుర్తింపు పొందిన 125 అడుగుల ధ్యాన బుద్ధ విగ్రహానికి వాన నీటితో ముప్పు పొంచి ఉందని, వెంటనే మరమ్మతులు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన విగ్రహాన్ని సందర్శించారు. విగ్రహానికి రెండు రంధ్రాలు పడ్డాయని, దీనివల్ల వర్షం నీటితో దెబ్బ తింటోందని తెలిపారు. లీకులతో సీలింగ్ కూడా ధ్వంసమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వినతి పత్రం అందించామని ఆయన వెల్లడించారు.