టమోటో లోడుతో బోల్తాపడిన లారీ
చినగంజాం: టమోటో లోడుతో వెళుతున్న బొలేరో వాహనం డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన సంఘటన సోమవారం చినగంజాం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి బాపట్లకు టమోటా లోడుతో వస్తున్న బొలేరో వాహనం చినగంజాం సమీపంలోని జాతీయ రహదారి వద్ద టీ జంక్షన్ చేరుకోగానే సిమెంట్ డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా కొట్టింది.
సంఘటనలో ఆర్.శ్రీనివాసరావు సురక్షితంగా బయట పడ్డాడు. హైవే మొబైల్ సిబ్బంది, పోలీస్ మొబైల్ ట్రాఫిక్ మళ్లించి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. పొక్లెయిన్ సాయంతో వాహనాన్ని తొలగించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నీట్‌లో విశేష ప్రతిభ కనబరిచిన రెంటాల విద్యార్థిని
రెంటచింతల: మండలంలోని రెంటాల గ్రామానికి చెందిన విద్యార్థిని బత్తుల మౌనిక నీట్ 2025 ఆల్‌ఇండియా స్థాయిలో విశేష ప్రతిభను చాటి 632 ర్యాంక్ సాధించింది. మౌనిక తండ్రిది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. బత్తుల నాగిరెడ్డి, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె మౌనిక మొదటి ప్రయత్నంలోనే అద్భుతవిజయం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తు హర్షం వ్యక్తం చేశారు. వైద్యవృత్తి ద్వారా నిరుపేదలైన ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడమే తన లక్ష్యమని విద్యార్థిని మౌనిక చెబుతున్నారు.
సూపర్ సిక్స్‌లోని ప్రతి పథకాన్ని అమలు చేస్తాం
నరసరావుపేట: ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్‌లోని ప్రతి పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిందని, కుటుంబంలో అర్హులైన ప్రతి పిల్లవానికి రూ.13వేలు చొప్పున అందించామని అన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్ జిలాని పాల్గొన్నారు.
పోలీసుశాఖకు 33 అధునాతన మోటారు సైకిళ్లు కేటాయింపు
నగరంపాలెం: సురక్షితమైన డ్రైవింగ్ ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడుతుందని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన మూడు బుల్లెట్లు, 30 అపాచీ ద్విచక్ర వాహనాలను సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఓ బైక్‌ను కొద్ది దూరం నడిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాల నిర్వహణ కోసం సరికొత్త బైక్‌లతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఆధునికమైన సాంకేతికతతో కూడిన సిగ్నలింగ్ వ్యవస్థ ఉందన్నారు. ఈ వాహనాలపై సుశిక్షితులైన పోలీస్ సిబ్బందితో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
గుంటూరు నగరం, తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి, మంగళగిరి, పొన్నూరు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. రహదారులపై వచ్చే, పోయే ఇతరుల వాహనాలకు ఇబ్బందులు కలిగించేలా అడ్డదిడ్డమైన డ్రైవింగ్, రేసులను అరికట్టేందుకు పెట్రోలింగ్ చేపడతామని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా ట్రాఫిక్ సమస్య తలెత్తిన సత్వరమే పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, ఎస్‌బీ సీఐ అళహరి శ్రీనివాస్, ఎస్పీ సీసీ ఆదిశేషు, పశ్చిమ ట్రాఫిక్ పీఎస్ సీఐ సింగయ్య, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ పాల్గొన్నారు.


