ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
బాపట్లటౌన్: రెప్పపాటులోనే ద్విచక్రవాహనాలను మాయం చేసే ఘరానా దొంగలను బాపట్ల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వివరాలను అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. బాపట్ల పట్టణం ఉప్పరపాలేనికి చెందిన రాజు నాగార్జునరెడ్డి, శారదాపురి కాలనీకి చెందిన ఉన్నాం వంశీ, మల్లావుల ధర్మతేజ, షేక్ చందు, జాలాది జాన్, మరో మైనర్ బాలుడు కలసి బాపట్ల పట్టణంతోపాటు, చీరాల రూరల్, చీరాల టూ టౌన్, వెదుళ్లపల్లి, బాపట్ల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు ద్విచక్ర వాహనాలను, మోటర్, రెండు సవర్ల బంగారం గొలుసును దొంగతనం చేశారు. బాపట్ల పట్టణంలోని జగనన్న కాలనీకి చెందిన పాలతోటి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పట్టణంలోని గుంటూరు ఫ్లైఓవర్ వద్ద గల చిల్లర గొల్లపాలెం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా తమ సిబ్బంది ఆరుగురులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగతనాలన్నీ తామే చేశామని అంగీకరించారు. ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రెండు సవర్ల బంగారపు గొలుసు, మోటర్‌ను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరిచి జైలుకు పంపిస్తామని తెలిపారు. కేసు ఛేదనలో ఎంతో కీలకంగా వ్యవహరించిన బాపట్ల పట్టణ సీఐ రాంబాబు, ఎస్‌ఐ విజయ్‌కుమార్, ఎస్సై చంద్రావతి, సిబ్బంది ప్రభాకరరావు, మనోజ్, శ్రీనివాసరావు, పోతురాజు, కృష్ణకిషోర్‌లను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు.
ఆరు వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు


