
పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే రావాలి
నరసరావుపేట: జిల్లాలో ఎస్‌ఎస్‌సీ, ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియేట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. శనివారం పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ విభాగాల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించే ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 4766 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియేట్, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు జిల్లాలోని పది సెంటర్లలో మొత్తం 1464 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. పరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశామని, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కూడా ఏర్పాటుచేసినట్లు జేసీ వెల్లడించారు. పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్‌గా ప్రకటించినందున విద్యార్థులు, పరీక్ష సిబ్బంది తమ వద్ద ఎటువంటి సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కేఎంఏ హుస్సేన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్
ధనుంజయ
అధికారులతో సమన్వయ సమావేశం