
అసంఘటిత రంగ కార్మికులకు ఉచిత న్యాయ సహాయం
యడ్లపాడు: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.నరేందర్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ కార్మిక వారోత్సవాలను పురస్కరించుకొని, మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎన్‌ఎస్‌ఎల్ నూలుమిల్లులో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో కార్మికులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్మిక చట్టాలు, కనీస వేతనాల హక్కులు, బాల కార్మికుల నిషేధ చట్టం తదితర అంశాలపై పూర్తి సమాచారం అందజేశారు. న్యాయ సహాయం అవసరమైన సందర్భాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని కార్మికులను ప్రోత్సహించారు. చిలకలూరిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీహెచ్‌ఎస్ ప్రసాద్, న్యాయవాదులు పి.వెంకటేశ్వరరావు, బి.రాజేష్, పారాలీగల్ వలంటీర్ జాషువా, ఏఎస్‌ఐ వెంగయ్య, నూలుమిల్లు జీఎం నరసింహం తదితరులు పాల్గొన్నారు.
కొండమోడు–పేరేచర్ల రహదారికి భూమి పూజ
రాజుపాలెం: మండలంలోని రెడ్డిగూడెం వద్ద కొండమోడు – పేరేచర్ల వరకు నేషనల్ హైవే ఏర్పాటుకు మండలంలోని రెడ్డిగూడెం వద్ద ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు భూమి పూజచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కొండమోడు నుంచి పేరేచర్ల వరకు సూమారు 50 కి.మీ నేషనల్ హైవే రహదారి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. దీని కోసం రూ.881 కోట్లు మంజూరయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రెండేళ్లలో రహదారి నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. అనుపాలెం, రాజుపాలెం, తదితర గ్రామాల వద్ద ప్రమాదాలు జరురగకుండా సర్వీసు రోడ్డు ఏర్పాటు చేస్తారని తెలిపారు. సత్తెనపల్లి పట్టణం, మేడికొండూరు గ్రామాలకు బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేషనల్ హైవేస్ ఈఈ సంజీవరాయుడు, టీడీపీ మండల కన్వీనర్ పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైలు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా చర్లపల్లి–బెరహంపూర్‌కు ప్రత్యేక రైలును ప్రయాణికుల సౌకర్యార్థం కేటాయించినట్లు సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–బెరహంపూర్ రైలు (07027) ప్రతి శుక్రవారం వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈనెల 9,16,23,20 తేదీలు, జూన్ 6,13,20,27వ తేదీల్లో నడుస్తుందని పేర్కొన్నారు. బెరహంపూర్–చర్లపల్లి రైలు (07028) ఈ నెల 10,17,24,31 తేదీలు, జూన్ 7,14,21,28 తేదీల్లో నడుస్తుందని తెలియజేశారు. ప్రయాణికులు గమనించాలని ఆయన సూచించారు.

అసంఘటిత రంగ కార్మికులకు ఉచిత న్యాయ సహాయం

అసంఘటిత రంగ కార్మికులకు ఉచిత న్యాయ సహాయం