
పాత గురజాలమ్మ గుడిని పునరుద్ధరించాలి
గురజాల: పల్నాడు జిల్లా గురజాల పట్టణం శివారులో పులిపాడు వెళ్లే దారిలో గల వెయ్యేళ్ల నాటి శిథిల పాత గురజాలమ్మ గుడిని పునరుద్ధరించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానికులైన కందిమల్ల శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం గురజాలమ్మ ఆలయ శిథిలాలను పరిశీలించారు. ఆలయం పునాది వరకు మాత్రమే మిగిలి ఉందని, మహా మండపం ముందు మెట్లకు అందమైన ఏనుగు శిల్పాలు, అర్ధమండపం ముందు ప్రాణాలర్పించుకుంటున్న పల్నాటి వీరుడు, గర్భాలయంలో ఆనవాళ్లు కోల్పోతున్న గురజాలమ్మ విగ్రహం ఆలయ చరిత్రకు అద్దం పడుతున్నాయని చెప్పారు. స్థానికులు శిథిలాలను పదిల పరిచి కాపాడుకోవాలని శివనాగిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో కందిమల్ల శ్రీనివాసరావు, మద్దినేని వెంకటేశ్వర్లు, ఆత్మకూరి వెంకట పుల్లారావు, శిల్పి సురటి వెంకటేష్ తదతరులు పాల్గొన్నారు.