
శిరిగిరిపాడు ఎస్సీ కాలనీలో కార్డన్ సెర్చ్
వెల్దుర్తి: మండలంలోని శిరిగిరిపాడు గ్రామ ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలనీలో టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు చెందిన ఒకే సామాజిక వర్గం వారు రాళ్లు రువ్వుకున్న సంఘటన జరిగినట్లు గుర్తుచేశారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటంతో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా గురజాల డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో ఉదయం 5గంటల నుంచే కాలనీలో ప్రతి ఇంటిని తనిఖీ చేశామన్నారు. ఇళ్లల్లోని మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గడ్డపారలు, గొడ్డళ్ళు, నీళ్లల్లో కారం కలిపి నింపిన బాటిళ్లు, గోతాల్లో నిల్వ ఉంచిన రాళ్లను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. ధ్రువీకరణ పత్రాలు లేని కత్తులు, గొడ్డళ్లు, ఇనుపరాడ్లు, కర్రలు, బరిశెలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలన్నారు. చిన్న విషయాలకు కూడా ఘర్షణలకు దిగి కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేయకుండా పనులు చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ఐదుగురు సీఐలు, 11 మంది ఎస్‌ఐలు, వంద మందికిపైగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పలు మారణాఽయుధాలు స్వాధీనం

శిరిగిరిపాడు ఎస్సీ కాలనీలో కార్డన్ సెర్చ్