నరసరావుపేట టౌన్: చట్టాలపై విదార్థులకు కూడా అవగాహన అవసరమని ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కె. మధుస్వామి తెలిపారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శుక్రవారం సెల్ఫ్ డిఫెన్స్, పోక్సో చట్టం తదితర అంశాలపై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి మధుస్వామి పోక్సో చట్టం గురించి క్షుణ్ణంగా వివరించారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలను తెలియజేశారు. రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను వివరించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య ఎదురైనా సంకోచించకుండా డయల్ 100కు గానీ, స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థలో గానీ సంప్రదించాలని సూచించారు. విద్యార్థి దశలో కష్టపడి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరేలా కృషి చేయాలని ఆయన తెలిపారు. తొలుత పట్టణ ఎస్‌ఐ అరుణ మాట్లాడుతూ మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచమని పేర్కొన్నారు. ప్రతి మహిళా ఫోన్లో నిక్షిప్తం చేసుకొని, ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని సూచించారు. తొలుత న్యాయమూర్తి హాస్టల్ వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మెనూను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్‌లు ఎన్. జయప్రద, జయలక్ష్మి, వసతి గృహ సిబ్బంది, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.