పిడుగురాళ్ల: నగదు విషయంలో ఇద్దరి మధ్యా జరిగిన ఘర్షణలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా వాసుపల్లి సీతారత్నం (57) పని చేస్తోంది. ఇదే ఆరోగ్య కేంద్రంలో సత్తెనపల్లికి చెందిన మన్నెం శ్రీనివాసరావు హెల్త్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరి మధ్యా పరిచయం పెరిగి చనువుగా ఉంటున్నారు. సీతారత్నం బ్రాహ్మణపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తోంది. ఆమెకు భర్త లేడు. శ్రీనివాసరావుతో పరిచయం పెరిగి తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడు. గురువారం రాత్రి ఇద్దరి మధ్యా నగదు విషయంలో మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో శ్రీనివాసరావు, సీతారత్నంపై దాడి చేసి బలంగా నెట్టడంతో తల భాగం గోడకు తగిలింది. తీవ్ర రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇరుగు పొరుగువారు గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు, ఎస్‌ఐ మోహన్ , సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. సీతారత్నం మృతికి కారకుడైన మన్నెం శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగదు విషయంలో ఘర్షణ
దాడి ఘటనలో మహిళ మృతి