
వృద్ధ దంపతులపై దాడి
బెల్లంకొండ: అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై గుర్తుతెలియని దుండగులు కొడవలితో దాడి చేసి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారం లాక్కెళ్లిన ఘటన బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఎం.రాజా తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బండారు గోవిందులు, అనసూయమ్మ ఇంట్లో నిద్రిస్తున్నారు. ఆదివారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి గట్టిగా తలుపులు కొట్టడంతో అనసూయమ్మ వెళ్లి తలుపులు తెరిచింది. ఒంటినిండా ముసుగు వేసుకొని, ముఖానికి నల్లని మాస్క్ ధరించిన వ్యక్తి కొడవలి చూపించి, గొంతు పట్టుకున్నాడు. మెడలో ఉన్న బంగారు గొలుసు ఇవ్వాలని లేకుంటే గొంతు కోస్తా అంటూ బెదిరించాడు. భయపడిన అనసూయమ్మ దొంగ వచ్చాడు... అంటూ గట్టిగా అరవడంతో, భర్త గోవిందులు వచ్చి ఎవరు అంటూ... గట్టిగా అరిచాడు. దుండగుడు వెంటనే అనసూయమ్మ మెడలో ఉన్న మూడు సవర్ల బంగారు గొలుసు లాక్కున్నాడు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త గోవిందులపై దుండగుడు కొడవలితో దాడి చేశాడు. దాడిలో రెండు చేతుల వేళ్ల మధ్యలో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే దుండగుడు భార్యాభర్తలను నెట్టేసి ఇంట్లోంచి బంగారం తీసుకుని పారిపోయాడు. కింద పడిపోయిన అనసూయమ్మ లేచి వేగంగా బయటకు వచ్చింది. ఇంటికి 20 మీటర్ల దూరంలో రోడ్డుమీద మరో వ్యక్తి బైక్‌పై ఉండడం గమనించింది. దాడి చేసిన దుండగుడు ఆ బైక్ ఎక్కి బెల్లంకొండ అడ్డరోడ్డు వైపు వెళ్లినట్లు తెలిపింది. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు, ఇరుగు పొరుగువారు చేరుకుని వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. గాయపడిన గోవిందులు సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని సోమవారం క్రైమ్ సీఐ బాలాజీ, పెదకూరపాడు సీఐ సురేష్, ఎస్‌ఐ రాజాతో కలిసి పరిశీలించారు. బాధితుల ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను, నిందితుల ఆధారాల కోసం పరిశీలించారు.
కొడవలితో దాడి చేసి బంగారంలాక్కెళ్లిన దుండగుడు ప్రతిఘటించిన వృద్ధునికి తీవ్ర గాయాలు

వృద్ధ దంపతులపై దాడి