భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ సంతకం, నకిలీ అధికారిక పత్రం (లెటర్‌హెడ్) ఫోర్జ రీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అధికారిక బదిలీలను ప్రభావితం చేసే ప్రయత్నంలో డిప్యూటీ స్పీకర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం, నకిలీ లెటర్‌హెడ్‌ను ఉపయోగించడం వంటి ఆరోపణలకు సంబంధించి స్థానిక పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదైంది. దీని ఆధారంగా కమిషనరేట్ పోలీసులు ప్రభుత్వ ఇంజనీర్‌ను అదుపు లోకి తీసుకున్నారు. ఈయన కెంజొహర్ జిల్లా హరిచందన్‌పూర్‌లో పని చేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్ హెంబ్రమ్‌గా గుర్తించా రు. విచారణ నిమిత్తం అతడిని రాజధాని పోలీసులు భువనేశ్వర్‌కు తీసుకువచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీని సిఫార్సు చేస్తున్నట్లుగా నకిలీ అధికారిక లేఖపై రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ భవానీ శంకర్ భోయ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణతో ఈ కేసు నమోదైంది. కేసు లో మరో పాత్రధారి కెంజొహర్ జిల్లా బన్సపాల్ మండలం జూనియర్ ఇంజనీర్ మోనాలిసా బెహరా కోసం దర్యాప్తు బృందం అధికారులు గాలిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పేరును దుర్వినియోగం చేసి అధికారిక సమాచారాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి స్థానిక క్యాపిటల్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ఊపందుకుంది.
విజిలెన్స్ వలలో ఆర్‌ఐ
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ తహసీల్దార్ పరిధి కొశాగుడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శైలబాలా నాయక్ లంచం తీసుకుంటూ రాష్ట్ర విజిలెన్స్ వలలో పడ్డారు. చేపల చెరువుల పథకంలో లబ్ధిదారుడైన రైతు సబ్సిడీ పొందేందుకు అవసరమైన చెరువు స్థలం ట్రేస్ మ్యాప్ కావాల్సి ఉంది. ట్రేస్ మ్యాప్ ఇచ్చేందుకు శైలబాలా నాయక్ రూ.4 వేలు లంచం అడిగిందని ఆరోపణ. ఈ విషయం ఆ రైతు విజిలెన్స్ అధికారులకు తెలియజేశాడు. మంగళవారం రైతు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు రూ.4 వేలు లంచం ఇస్తున్న సమయంలో విజిలెన్స్ సిబ్బంది దాడి చేశారు. ఆమెను డబ్బుతో పట్టుకొని అరెస్టు చేశారు. ఆమెకు చెందిన రెండు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ దాడికి సంబంధించి కొరాపుట్ రీజన్ విజిలెన్స్ కార్యాలయం, జయపురంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు విజిలెన్స్ ఎస్పీ ఎస్.సుశ్రీ బుధవారం వెల్లడించారు.
యువకుడి అనుమానాస్పద మృతి
భువనేశ్వర్: భీంపూర్ కాలువలో యువకుడి మృతదేహం కలకలం రేపింది. మృతుడు అనంతపురం గ్రామానికి చెందిన ప్రభాత్ బెహెరాగా గుర్తించారు. మృతుడి తల, ముఖంపై బలమైన గాయాల గుర్తులు ఉండటంతో హత్యాకాండగా భావిస్తున్నారు. మృతదేహం సమీపంలో ప్లాస్టిక్ పైపు, పగిలిన మద్యం సీసా లభ్యమయ్యాయి. కొంత దూరంలో స్కూటీ పడి ఉంది. పొహలా స్టేషన్ పోలీసులు, క్లూస్‌టీం బృందం సంఘటనా స్థలానికి చేరి దర్యాప్తు చేపట్టింది. మంగళవారం రాత్రి 12 గంటలకు టెన్నిస్ పాత్రో అనే ఇసుక వ్యాపారి తమ కుమారుడిని ఇంటి నుంచి తీసుకువెళ్లాడని ప్రభాత్ కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం సేవించిన తర్వాత అతడిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. కాలువ గట్టు వద్ద యువకుడి మృత దేహం లభ్యం కావడంతో ఉద్రిక్తత నెలకొంది. నొఖొరా – నియాలి రహదారిని గ్రామస్తులు దిగ్బంధించారు. ఇరువైపులా వందలాది వాహనాలను నిలిపివేశారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు రహదారి దిగ్బంధించారు. యువకుడి హత్య ఆరోపణలపై పోలీసులు హైవా యజమానిని, అతని సోదరుడిని విచారిస్తున్నారు.


