● ఉన్నతస్థాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం
● ఏడు రోజుల్లో నివేదిక
భువనేశ్వర్: పాఠశాల పాఠ్య పుస్తకాలలో భారీస్థాయిలో తప్పులు చోటు చేసుకున్నాయి. దీని పట్ల ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో గుర్తించిన తప్పులపై ఉన్నత స్థాయి విచారణకు బుధవారం ఆదేశించారు. లోక్ సేవా భవన్‌న్‌లో జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి ఈ తప్పిదంపై విచారణకు ఆదేశించడంతో ముగ్గురుతో కూడిన త్రిసభ్య ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అభివృద్ధి కమిషనర్ అధ్యక్షతన ఈ కమిటీ పాఠ్య పుస్తకాల్లో దొర్లిన తప్పులపై విచారణ జరపనున్నట్టు ప్రకటించారు. పాఠ్యపుస్తకాల తయారీ, ముద్రణ, ప్రచురణ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఈ తప్పులకు బాధ్యులైన అధికారులు, విభాగాలు లేదా ఏజెన్సీలను గుర్తించడంతో పాటు, ఈ లోపాలకు దారితీసిన విధానపరమైన లేదా పర్యవేక్షణా వైఫల్యాలను కూడా ఈ కమిటీ అంచనా వేస్తుంది. ఏడు రోజుల్లో నివేదికను సమర్పించాలని కమిటీని సీఎం ఆదేశించారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.ఈ సమావేశానికి పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్, ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్, ఇతర ఉన్నతాధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రభుత్వం సూచించిన పాఠ్యపుస్తకాలలో తప్పులు బయటపడటంపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఆ లోపాలను సరిదిద్ది, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) వర్గాలు తెలిపాయి. పాఠ్యపుస్తకాలలో కనిపించిన తప్పులకు ఏ అధికారులు, విభాగాలు లేదా సంస్థలు బాధ్యత వహించాయో నిర్ధారించే బాధ్యతను విచారణ కమిటీకి అప్పగించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కమిటీ నివేదికలోని అంశాలు తదుపరి చర్యలకు ప్రాతిపదికగా లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలలో 1,678 తప్పులు దొర్లినట్లు ప్రచారం కావడంతో పలువురి దృష్టిని ఆకట్టుకుంది. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పాఠ్యపుస్తకాల ప్రతులను పరిశీలన కోసం సమర్పించాలని అధికారులను కోరారు. ఒడిశా పాఠ్యప్రణాళిక – 2025 మరియు జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ – 2020)కు అనుగుణంగా ఎస్‌సీఈఆర్‌టి ఒడిశా తయారుచేసిన పాఠ్యపుస్తకాలలో గుర్తించిన 1,678 తప్పులు కేవలం అక్షర దోషాలకే పరిమితం కాలేదు. వాటిలో వాస్తవ దోషాలు, భౌగోళిక వక్రీకరణలు, ప్రముఖుల పేర్ల తప్పుల స్పెల్లింగ్ మరియు తప్పుడు ఫోటోలు ముద్రితం కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అయింది. ఉదాహరణకు కర్ణాటక శాసన సభ ఫోటోను ఒడిశా శాసన సభగా ముద్రించడం, నియమగిరి కొండలను జార్ఖండ్‌లో ఉన్నట్లుగా తప్పుగా వర్ణించడం, గంజాంలోని బెర్హంపూర్‌ను నగరం బదులుగా జిల్లాగా పేర్కొనడం మరియు సర్ ఐజాక్ న్యూటన్‌ను విచిత్రంగా ‘గొప్ప పైలట్‘అని వర్ణించడం వంటివి ఉన్నాయి. ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకాలలో అత్యధిక సంఖ్యలో తప్పులు దొర్లాయి. సంస్కృతం, సాంఘిక శాస్త్రం, సాహిత్యం, ఆంగ్లం మరియు గణితం వంటి సబ్జెక్టులలో కలిపి 705 తప్పులు ఉన్నాయి. ఇలాంటి లోపాలు విద్యార్థులను వారి చరిత్ర, భౌగోళికం, సంస్కృతి మరియు గుర్తింపు గురించి తప్పుదారి పట్టించగలవని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సమావేశానికి పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం కార్యదర్శి ఎన్. తిరుమల నాయక్, ఓఎస్‌ఈపీఏ డైరెక్టర్ అనన్య దాస్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ మధుస్మిత సాహు తదితరులు హాజరయ్యారు.విద్యార్థులకు సరఫరా అవుతున్న బోధనా సామగ్రి నాణ్యతపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కమిటీ విచారణ ఫలితం జవాబుదారీతనాన్ని నిర్ధారించి తరగతి గది బోధనపై మరింత ప్రభావం చూపకముందే ప్రభావితమైన పాఠ్యపుస్తకాలలో దిద్దుబాట్లకు మార్గం సుగమం చేస్తుందని ఈ అధికారులు భావిస్తున్నారు.


