కొండపై కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తల సర్వే | - | Sakshi
Sakshi News home page

కొండపై కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తల సర్వే

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

ఎచ్చెర్ల : చిలకపాలెంలోని నారాయణపురం రెవెన్యూ పరిధిలో ఉన్న కొండపై కేంద్ర భూగర్భ ఖనిజాల సర్వే బృందం గ్రాఫైట్‌ వంటి ఖనిజాలు వెలికితీతకు శనివారం సర్వే చేపట్టింది. తొలుత స్థానిక తహశీల్దార్‌కు గానీ, గ్రామ రెవెన్యూ అధికారికి గానీ, స్థానిక అధికారులకు గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, కనీసం రైతులకు తెలియజేయకుండా సర్వే చేపట్టడం గమనార్హం. దీనిని గమనించిన స్థానిక రైతులు అధికారులకు సమాచారం అందించారు. గ్రామ రెవెన్యూ అధికారి వచ్చి ఎచ్చెర్ల తహశీల్దార్‌ కార్యాలయానికి వీరిని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా నారాయణపురం భూములు తరతరాలుగా సాగుచేస్తున్న స్థానిక రైతులు పుట్టా మల్లేసు, తోనంగి నందోడు, కోరాడ అప్పన్నలు మాట్లాడుతూ ఇక్కడ ఖనిజాలు ఉన్నాయంటూ తమ భూములను లాక్కోవాలని చూస్తే పోరాడుతామన్నారు. వీటినే నమ్ముకుని దళిత, బీసీ, పేద రైతులు తరతరాల నుంచి బతుకుతున్నామని చెప్పారు. కొండకు ఆనుకుని ఎచ్చెర్ల తహశీల్దార్‌ కార్యాలయం, అంబేడ్కర్‌ వర్శిటీ, రాజీవ్‌ గాంధీ ట్రిపుల్‌ ఐటీలు, చుట్టూ గ్రామాలున్నాయన్నారు. కొండ ప్రాంతంలో మైనింగ్‌ చేస్తే పర్యావరణం నాశనం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మైనింగ్‌కు అనుమతులు ఇవ్వవద్దని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement