రాయగడ: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్‌మఝి, కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌లు శుక్రవారం రాయగడ పర్యటనలో పర్యటించగా.. తమను అతిథులుగా ఆహ్వానించిన జిల్లా యంత్రాంగం అసలు పట్టించుకోకుండా అవమానించారని రాయగడ, బిసంకటక్, గుణుపూర్ శాసనసభ్యులు అప్పలస్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్ గొమాంగోలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నాలుగో పర్యాయాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు రాయగడకు వచ్చారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం స్థానిక భారిజోల సమీపంలోని ఐఏసీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఎమ్మెల్యేలను జిల్లా యంత్రాంగం ఆహ్వానించింది. అయితే ఉదయం 10.30 గంటలకు కార్యక్రమానికి రావాల్సిన ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు సుమారు రెండు గంటలు ఆలస్యంగా హాజరయ్యారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి , కేంద్ర మంత్రుల ప్రసంగాలు పూర్తయినప్పటికీ తమకు సభలో మాట్లాడే అవకాశం కల్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తమను ఆహ్వానించి కేవలం వేదికకే పరిమితం చేశారని ఆరోపించారు. ఈ ప్రాంత సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటిని క్షుణ్ణంగా తెలిసే తమకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడంతో అవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేకపోయామని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో ప్రధాన సమస్యగా కొన్నేళ్లుగా నలుగుతున్న మెడికల్ కళాశాల ఏర్పాటు వంటి ప్రధాన సమస్య గురించి ముఖ్యమంత్రి సభలో కనీసం ప్రస్తావించకపోవడం విచారకరమని ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక అన్నారు. అలాగే జిల్లాలో ఏర్పాటు కానున్న హోమియో కళాశాల వంటి ప్రధాన సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలోని కాసీపూర్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అలజడికి సంబంధించి సభలో ప్రస్తావిస్తామనే భయంతోనే తమకు మాట్లాడే అవకాశం కల్పించలేదని ఆరోపించారు. ఏదిఏమైనప్పటికీ ఈ తరహా అవమానాన్ని తమకు భవిష్యత్‌లో కూడా ఎదురైతే కచ్చితంగా తగిన జవాబు చెబుతామని అన్నారు.
మాట్లాడే అవకాశం
కల్పించకపోవడం బాధాకరం
సీఎం దృష్టికి సమస్యలను
తీసుకెళ్లలేకపోయాం
ముగ్గురు ఎమ్మెల్యేల అసంతృప్తి


