భువనేశ్వర్: యాభై ఆరేళ్ల పాటు పేదరికంలో మగ్గిపోయిన ఆ ‘తమ్ముడు’పై ఆర్థిక సాయాల వాన కురుస్తోంది. అక్క అస్థి పంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లి డబ్బులు అడిగిన కెంజొహర్ జిల్లాకు చెందిన ఒక గిరిజన వ్యక్తికి ఇప్పుడు సంక్షేమ పథకాలు వచ్చి వరిస్తున్నాయి. తన సోదరి అవశేషాలను వెలికితీసి, ఆమె మరణానికి రుజువుగా అస్థిపంజరాన్ని సమర్పించడానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరం నడిచి ఒడిశా గ్రామీణ బ్యాంక్ స్థానిక శాఖకు వెళ్లడంతో ఈ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రసారం ప్రభుత్వ, అధికార యంత్రాంగాన్ని కుదిపేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి జోక్యం చేసుకోవడంతో జిల్లా యంత్రాంగం త్వరితగతిన చర్యలు చేపట్టి, 50 ఏళ్ల జీతూ ముండాకు తక్షణ సామాజిక భద్రతా సహాయాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు. గురు వారం ఈ ఘటనపై రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఉత్తర విభాగం) ఎస్. కె. మహా పాత్రో విచారణ జరిపిన కొన్ని గంటల్లోనే పటనా మండలం దియానాలి గ్రామంలో ఉంటున్న జీతూ ముండాతో అతని సోదరుడి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు కల్పించారు.
ఈ బాధితుల్ని రాష్ట్ర ప్రభుత్వ నెలవారీ ఆర్థిక సహాయ పథకంలో నమోదు చేసింది. అలాగే అతనికి ప్రతి నెలా 35 కిలోల ఉచిత బియ్యం పొందేందుకు వీలుగా రేషన్ కార్డు జారీ చేశారని అధికారులు తెలిపారు. దీంతో పస్తులు ఉండాల్సిన గడ్డు పరిస్థితులు గట్టెక్కాయి. జనవరిలో మరణించిన అతని సోదరి కల్రా (56)కు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసే ప్రక్రియను కూడా యంత్రాంగం వేగవంతం చేసింది. జీతూ ముండాను చట్టబద్ధమైన వారసుడిగా గుర్తించి ఏప్రిల్ 27న ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోపే ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయిన పొదుపు మొత్తం వడ్డీతో సహా రూ. 19,402 అతనికి అందజేశారు. మానవతా దృక్పథంతోనే యంత్రాంగం ఈ చర్యలు తీసుకుందని కెంజొహర్ జిల్లా కలెక్టర్ విశాల్ సింగ్ అన్నారు. ఈ చర్యల్లో భాగంగా అతనికి జిల్లా రెడ్ క్రాస్ నిధి నుంచి రూ. 30,000 తక్షణ సాయంగా అందించారు. యంత్రాంగం విధానం కంటే మానవత్వానికి ప్రాధాన్యత కల్పించి అన్ని విధాల సంక్షేమ పథకాల సౌలభ్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ సాయంతో పాటు ముండాకు ప్రైవేట్ విరాళాలు అందుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆయన పేరు మీద రూ. 10 లక్షలు జమ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్య సభ సభ్యుడు సంజయ్ సింగ్ రూ. 50,000 విరాళంగా అందించారు.


