జయపురం: సమాజాన్ని చైతన్యపరచి అభ్యుదయ మార్గంలో నడిపించే కళల్లో నాటక కళ ప్రధానమైందని, కాల క్రమేణా కనుమరుగవుతున్న నాటక రంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని కళాకారుడు, నాటక రచయిత నిరంజన్ పాణిగ్రహి అన్నారు. శుక్రవారం ప్రపంచ నాటక దినోత్సవాన్ని స్థానిక కొత్తవీధి సీనియర్ నాగరిక కమిటీ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయపురం ఆల్ ఇండియా రేడియో విశ్రాంత అధికారి ఉదయ శంకర జాని మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతల నుంచి సమాజాన్ని కాపాడడంలో నాటక రంగం ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. జయపురంలో అనేక మంది సీనియర్ కళాకారులతో పాటు, ఔత్సాహిక నాటక కళాకారులు ఉన్నారని, వారిని సమైఖ్యపరచి నాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో ప్రముఖ నాటక కళాకారుడు గోపాల సామంతరాయ్, రచయిత కళాకారుడు కృష్ణచంద్ర హోత్త, సంగీత కళాకారుడు ధిరెన్ మోహన్ పట్నాయిక్, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయిక్, కళాకారుడు ప్రకాశ మహంతి, సాహితీవేత్త లక్ష్మీకాంత పాఢీ, మహ్మద్ షరీఫ్, రబీ పాత్రో, సురేష్ హోత్త, గుప్త పాణిగ్రహి, డాక్టర్ గాయిత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు.


