శ్రీ జగన్నాథుని రథ కలప
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. సంస్కృతి, సంప్రదాయ రీతిలో సకాలంలో పనులు చేపట్టి పూర్తి చేయడం విశేషం. ఈ ఏడాది జరగనున్న యాత్ర కోసం రథాల తయారీ కోసం కలప దుంగల సేకరణ కొనసాగుతుంది. ఏటా శ్రీ రామ నవమి పురస్కరించుకుని రథాల తయారీలో కీలకభాగంలో వినియోగించే భారీ కలప దుంగల్ని ఎంపిక చేసి లాంచనంగా చీలిక పనులు ప్రారంభించడం ఆచారం. కటక్ ఖుపురియా ప్రభుత్వ కలప మిల్లులో పండితుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రతి పని స్వామి ఆజ్ఞతో జరగాల్సిందే. అందుకు సంకేతంగా పూరీ శ్రీ మందిరం రత్న వేదికపై కొలువై ఉన్న మూల విరాటు ఆజ్ఞకు సంకేతంగా ప్రత్యేక పూల మాలని అత్యంత భక్తి శ్రద్ధలతో కలప మిల్లు ప్రాంగణానికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో స్థానికులు ఆసక్తితో పాలుపంచుకున్నారు. రథంలో కీలక భాగం తయారీలో వినియోగించే 12 అడుగుల పొడవైన 3 ధవురా కలప దుంగల్ని ఎంపిక చేశారు. వాటిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని రథాల తయారీలో ఒక్కోటి వంతున వినియోగిస్తారు.


