నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలి
జయపురం: జయపురం ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్న రెవెన్యూ డివిజన్ కమిషనర్ కార్యాలయంతో పాటు స్పెషల్ సర్క్యూట్ హౌస్ ఏర్పాటు చేయాలని జయపురం వికాస్ మంచ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయపురం వికాస్ మంచ్ తరపున మంచ్ సాధారణ కార్యదర్శి నబకృష్ణ చౌదరి మంత్రి సురేష్ చంద్ర పూజారిని కొరాపుట్‌లో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కమిషన్ కార్యాలయం ఈ ప్రాంతానికి దూరంలో ఉందని, దీనివలన కార్యాలయానికి వచ్చేందుకు సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్త చేశారు. అవిభక్త కొరాపుట్ జిల్లాకు కేంద్ర బిందువైన జయపురంలో ఏర్పాటు చేస్తే రెవెన్యూ సంబంధిత విషయాల్లో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు పలువురు సభ్యులు ఉన్నారు.


