కోట్‌పాడ్‌లో సినిమా షూటింగ్
కొరాపుట్: జిల్లాలోని కోట్‌పాడ్ పట్టణంలో తెలుగు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎటువంటి హంగామా లేకుండా కోట్‌పాడ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. కోట్‌పాడ్‌కి చెందిన వివేకనంద వర్మ నిర్మాతగా వ్యవహరిస్తూ స్వస్థలంలో షూటింగ్ చేయిస్తున్నారు. ఈ సినిమాకి వరప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా.. హీరోగా వివేక్ వర్మ, హీరోయిన్‌గా సంకీర్తన, మరో ముఖ్యపాత్రలో కామెడియన్ సప్తగిరి నటిస్తున్నారు. షూటింగ్‌ను చూసేందుకు సమీప తెలుగు ప్రజలు తరలి వెళ్తున్నారు. మరో 15 రోజులు కోట్‌పాడ్ ప్రాంతంలో షూటింగ్ జరగనుంది. ఈనెల 25వ తేదీ నుండి భారీ సన్నివేశాల షూటింగ్ జరపనున్నారు.
రైతుకు పరిహారం అందజేత
జయపురం: ఈనెల 17వ తేదీన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి చికాపూర్ పంచాయతీ డొంగధార గ్రామంలోని ఒక కల్లంలో 4 ఎకరాల్లో పండిన ధాన్యం కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే బొయిపరిగుడ తహసీల్దార్ స్నిగ్ద చౌదరి, చికాపూర్ పంచాయతీ సర్పంచ్ రాజు ఖిళో కలిసి గ్రామానికి వెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. దీంతో బాధిత రైతు రమేష్ గొలారికి పరిహారంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని శనివారం అందజేశారు.
రక్తదాన శిబిరం
జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంద్రలోని అరవింద శిక్షా నికేతన్ ప్రాంగణంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా దాతల నుంచి 33 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జూనియర్ రెడ్‌క్రాస్ సాధన సభ్యుడు యజ్ఞేశ్వర పండ మాట్లాడుతూ రక్తదానం మహత్తర దానమని, మనం ఇచ్చే ప్రతి రక్తపుబొట్టు ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులు, గర్భిణులు, వ్యాధిగ్రస్తులను కాపాడుతుందన్నారు. అనంతరం జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ సాధన సభ్యుడు రాధాశ్యామ్ సాహు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ అధికారి హరేకృష్ణ మహరాణ, కొరాపుట్ జిల్లా సాధన సభ్యుడు జ్యోతీ రంజన్ నంద తదితరులు పాల్గొన్నారు.
కోరుకొండ ఐఐసీగా విజయ్‌కుమార్
మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి నూతన ఐఐసీగా ఆర్.విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన ఐఐసీ హిమాంశు శేఖర్ బారిక్‌ను మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు. అందరి సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తానని విజయ్‌కుమార్ తెలియజేశారు.
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
శ్రీకాకుళం రూరల్: హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, బొల్లినేని మెడిస్కిల్ సంయుక్తంగా బ్యుటీషియన్, హోటల్ మేనేజ్‌మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
కోట్‌పాడ్‌లో సినిమా షూటింగ్
కోట్‌పాడ్‌లో సినిమా షూటింగ్


