పద్మపూర్‌లో ఘనంగా చొయితీ ఉత్సవాలు
రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌లో సమితి స్థాయి చొయితీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. గుణుపూర్ ఎంఎల్‌ఏ సత్యజీత్ గొమాంగో ముఖ్యఅతిథిగా ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు బీడీవో కురేష్ చంద్ర జాని, సమితి అధ్యక్షురాలు మణిమాల సబర్‌లు సమీపంలోని ఖమాపదర్ నది జలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవ వేదిక వద్ద ఉంచారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఎల్‌ఏ గొమాంగో మాట్లాడుతూ.. మన ప్రాంత ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించేందుకు ఇలాంటి ఉత్సవాలు ప్రతిబింబిస్తాయని అన్నారు . దీనితోపాటు ఈ ప్రాంత కళాకారులను ప్రొత్సాహించేందుకు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు వారికి చేదోడుగా నిలుస్తాయన్నారు. వారికి కళారంగంపై మరింత ఆసక్తి పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి మాట్లాడుతూ.. చొయితీ ఉత్సవాలు ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. వారిలో దాగిఉన్న ప్రతిభను కనబరిచేందుకు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పత్రికారంగంలొ విశేష సేవలు అందిస్తున్న కొంతమంది పాత్రికేయులు, సమాజ సేవకులను వేదికపై సత్కరించి గౌరవించారు.
పద్మపూర్‌లో ఘనంగా చొయితీ ఉత్సవాలు
పద్మపూర్‌లో ఘనంగా చొయితీ ఉత్సవాలు


